కొల్లాపూర్, నవంబర్ 10 : విజ్ఞులు రాజకీయ చైతన్యవంతులైన కొల్లాపూర్ ప్రజలు శక్తివంచన లేకుండా పనిచేసే బీఆర్ఎస్ అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి కోరారు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రజల దీవెనలు ఉన్నంత కాలం తనను ఆశీర్వదిస్తారని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం ఎంపీ రాములు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రంగినేని అభిలాష్‌రావు, కురుమ విజయ్‌కుమార్, గౌరారం వెంకట్‌రెడ్డి, ధారాసింగ్, రాంభూపాల్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే బీరం నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుంచి స్వచ్ఛంధంగా తరలివచ్చిన పార్టీ శ్రేణులతో అంబేద్కర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి రహదారి పోడువునా పటాకులు పేల్చుతూ, డీజే పాటలకు కళాకారులు గజ్జెకట్టి పాట లు పాడారు. యువత డీజే పాటలకు నృతాలు చేస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి బీరం మాటాడుతూ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తనను మరోసారి గెలిపిస్తాయన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెసోళ్లు చెప్పే మాయమాటలకు మోసపోరని పేర్కొన్నారు. మేం అభివృద్ధి చేశాం.. ఓటు హక్కు మాకు ఉందని స్పష్టం చేశారు.
పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ తొమ్మిందేండ్ల ఆరు నెలలు పార్టీలో ఉండి తన స్వార్థ ప్రయోజనాలకు పాల్పడుతుండడంతో జూపల్లి కృష్ణారావు పార్టీ నుంచి నిష్క్రమణకు గురైయ్యారని చెప్పారు. ప్రజా సునామీలో జూపల్లి కొట్టుకపోవడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. నాయకులు ప్రజల గుండెల్లో ఉండాలి, కొంతమంది నాయకులు అమ్ముడుపోయినా, నా తమ్ముళ్లను కొనుగోలు చేయలేరని బీరం పేర్కొన్నారు. జూపల్లి కృష్ణారావుకు రాజకీయ సమాధి తప్పదని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. కొల్లాపూర్‌ను ఎంతో అభివృద్ధి చేశాం, వంద పడకల దవాఖానతోపాటు డయాలసిస్ సెంటర్, హార్టికల్చర్, పాలిటెక్నిక్ కళాశాలలతోపాటు మామిడి ప్రాసెసింగ్ సెంటర్‌ను మంజూరు చేయించడంతోపాటు దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపించినట్లు వివరించారు. అందుకే మీ బిడ్డగా, తమ్ముడిగా, అన్నగా తనను ఆశీర్వదించి ఈనెల 30న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలలో మీ అమూల్యమైన ఓటును బీఆర్ఎస్ కారు గుర్తుకు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అంతకుముందు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సింగపట్నంలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు, గ్రామాల అధ్యక్షుడు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.