(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ) : క్లౌడ్, నెట్వర్క్, సీడీఎన్ సర్వీసులను అందించే ప్రఖ్యాత ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ క్లౌడ్‌ఫ్లేర్ సేవల్లో మంగళవారం సాయంత్రం తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా సోషల్‌మీడియా వేదిక ఎక్స్, ఏఐ చాట్బాట్లు గ్రోక్, చాట్‌జీపీటీ తదితర ఏఐ సంస్థల సేవలు నిలిచిపోయాయి. ఆయా వెబ్సైట్లు తెరిస్తే ‘ఎర్రర్ కోడ్ 500’ అని వస్తోందంటూ వినియోగదారులు ఇతర సోషల్‌మీడియా వేదికల్లో స్క్రీన్ షాట్లు పోస్ట్ చేశారు. ఎక్స్‌లో ఫీడ్ చూడలేకపోతున్నామని, పోస్టులు కూడా చేయలేకపోతున్నామని యూజర్ ఒకరు పేర్కొన్నారు. ‘ఎక్స్’ ఖాతా తెరువగానే ఖాళీ పేజీలు దర్శనమిచ్చాయని మరో యూజర్ పేర్కొనగా, చాట్‌బాట్ ‘గ్రోక్’ తమ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వట్లేదని ఇంకో యూజర్ తెలిపారు. ‘చాట్‌జీపీటీ’ పేజీ ఓపెన్ చేస్తే.. ‘ప్లీజ్ అన్‌లాక్ ఛాలెంజెస్.. క్లౌడ్‌ఫ్లేర్.కామ్ టూ ప్రొసీడ్’ అనే మెసేజీ వచ్చిందని మరొక నెటిజన్ కామెంట్ చేశారు. క్లౌడ్‌ఫ్లేర్ డౌన్ కారణంగా పేపాల్, ఉబర్ లాంటి సర్వీసులు కూడా సరిగ్గా పనిచేయడం లేదంటూ కస్టమర్లు ఫిర్యాదులు చేశారు.
డౌన్‌డిటెక్టర్ వెబ్‌సైట్‌ను అనుసరించి.. భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 4.37 గంటలకు క్లౌడ్‌ఫ్లేర్ సేవల్లో అంతరాయం మొదలైనట్టు సమాచారం.
తమ సేవల్లో అంతరాయం కలిగిన విషయం తమ దృష్టికి వచ్చిందని, ప్రస్తుతం తమ బృందం సమస్యను సరిదిద్దే పనిలో ఉన్నదని క్లౌడ్‌ఫ్లేర్ వెల్లడించింది. అయితే, సర్వీసుల్లో అంతరాయానికి గల కారణాన్ని పేర్కొనలేదు.
క్లౌడ్‌ఫ్లేర్ అనేది ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్‌ఫామ్. వెబ్సైట్లు, ఇతర ఆన్లైన్ వేదికలకు టెక్ సర్వీసులను అందిస్తుంది. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న ఈ క్లౌడ్‌ఫ్లేర్ సర్వీసులను ఆధారంగా చేసుకొనే ఎక్స్, గ్రోక్, చాట్‌జీపీటీ, పేపాల్, ఉబర్, మూడీస్ కార్పొరేషన్, టీసీఎస్, విప్రో తదితర కంపెనీల ప్లాట్‌ఫామ్‌లు పనిచేస్తున్నాయి.