టీ20 ప్రపంచకప్ టోర్నీకి జట్టు కూర్పు విషయంలో పూర్తి స్పష్టతతో ఉన్నామని భారత చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. కెప్టెన్ రోహిత్‌శర్మతో కలిసి జట్టు ఎలా ఉండాలనే దానిపై అవగాహనతో ఉన్నామని తెలిపాడు. కుర్రాళ్లపై ఎలాంటి ఒత్తిడి లేదన్న ద్రవిడ్..ఒక్క మ్యాచ్‌తో లేదా సిరీస్‌తో ఒక అంచనాకు రాలేమన్నాడు. ఆల్‌రౌండర్‌గా వెంకటేశ్ అయ్యర్ అంచనాలు అందుకున్నాడని, మెగాటోర్నీలో రాణించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నాడు. చీఫ్ కోచ్‌గా 100 రోజుల్లో చాలా నేర్చుకున్నట్లు చెప్పిన గ్రేట్ వాల్.. మీడియాతో పలు కీలక విషయాలపై మాట్లాడాడు.
కోల్‌కతా: భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాడు. గత టీ20 ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన తర్వాత రవిశాస్త్రి నిష్క్రమణతో చీఫ్ కోచ్‌గా బాధ్యతలు అందుకున్న ద్రవిడ్ తన వ్యూహాలను అమలు పరుస్తున్నాడు. కెప్టెన్ రోహిత్‌శర్మ, సెలెక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ సహకారంతో అద్భుత విజయాలు అందిస్తున్నాడు. వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమ్ఇండియా క్లీన్‌స్వీప్ చేసిన నేపథ్యంలో మీడియాతో ద్రవిడ్ మాట్లాడుతూ..
ఆస్ట్రేలియా వేదికగా ఎనిమిది నెలల తేడాతో జరిగే ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌లో జట్టు కూర్పు ఎలా ఉండాలనే దానిపై పూర్తి స్పష్టతతో ఉన్నామని ద్రవిడ్ అన్నాడు. ‘రోహిత్, సెలెక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్, నేను కలిసి జట్టు ఎలా ఉండాలనే దానిపై ఒక కచ్చితమైన ఆలోచన ఉంది. దీనికంటూ ప్రత్యేకమైన ఫార్ములా అంటూ లేదు. కానీ సమతూకం, కూర్పుపై ఆలోచిస్తూనే..ప్లేయర్లపై పని ఒత్తిడిని పరిశీలిస్తున్నాం. ఆస్ట్రేలియాలో ఉండే పరిస్థితులకు అనుగుణంగా ప్రతీ ప్లేయర్‌కు ఒకరు బ్యాకప్ ఉండేలా చూస్తున్నాం. అందుకు తగ్గట్లు ప్రతీ ఒక్కరికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం’ అని అన్నాడు.
‘ఓవైపు బయోబబుల్ నుంచి ప్లేయర్లకు ఉపశమనం కల్గిస్తూ ప్లేయర్లకు అవకాశం ఇస్తున్నాం. సీనియర్ ప్లేయర్లు కోహ్లీ, పంత్, బుమ్రా, షమీ, రాహుల్ గైర్హాజరీలో రుతురాజ్, ఇషాన్, వెంకటేశ్, రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్ లాంటి యువ క్రికెటర్లు అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. మేము 15 మంది ప్లేయర్లకే పరిమితం కాదల్చుకోలేదు. టీ20 ప్రపంచకప్ నాటికి ఒక్కో ప్లేయర్ 10-15 మ్యాచ్‌లు ఆడేలా అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నాం. పరిస్థితులకు అనుగుణంగా ఏ ప్లేయర్‌ను ఎలా వాడుకోవాలో కెప్టెన్ రోహిత్ చేతిలో ఉంది. ఒక మ్యాచ్తోనో, ఒక సిరీస్తోనో ఆటగాళ్లపై అంచనాకు రాలేం. ఇది చాలా కఠినమైన ఫార్మాట్. ఒత్తిడికి గురికాకుండా ఆడాలని సూచిస్తున్నాం’ అని ద్రవిడ్ అన్నాడు.
వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయిన ఇషాన్ కిషన్, అవేశ్‌ఖాన్‌కు ద్రవిడ్ మద్దతుగా నిలిచాడు. మెరుగైన ప్రదర్శన కనబరిచినందువల్లే వాళ్లు ఇక్కడ ఉన్నారని అన్నాడు.
‘ఐపీఎల్లో ఓపెనర్‌గా రాణించిన వెంకటేశ్ అయ్యర్‌కు జాతీయ జట్టులో అతడి పాత్ర ఏంటో తెలుసు. పరిస్థితులకు తగ్గట్లు ఏ స్థానంలోనైనా ఆడేలా తీర్చిదిద్దుతున్నాం. ప్రతీసారి అతడు అద్భుత పరిణతి కనబరుస్తున్నాడు. ఇది జట్టుకు మంచి శుభపరిణామం. విండీస్‌తో మ్యాచ్‌లో దీపక్ చాహర్ గాయపడగా, వెంకటేశ్ ఆల్‌రౌండర్‌గా నిరూపించుకున్నాడు. ఒక్కోసారి క్లిష్టమైన పరిస్థితుల్లో బౌలింగ్ చేయాల్సి వస్తుంది. మ్యాచ్ బాగా జరుగుతున్నప్పుడు కెప్టెన్‌కు ఆరో బౌలర్ అంతగా అవసరం పడదు. అవసరం వచ్చినప్పుడు అది కఠినమైన పరిస్థితుల్లోనే ఉంటుంది. మొత్తానికి వెంకటేశ్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ ఆకట్టుకున్నాడు’ అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.
భారత ప్రధాన కోచ్‌గా ద్రవిడ్ బాధ్యతలు తీసుకుని ఈనెల 17కు సరిగ్గా 100 రోజులు అవుతుంది. ఈ నేపథ్యంలో ద్రవిడ్ స్పందిస్తూ ‘ఇన్ని రోజుల ప్రయాణంలో నేను నేర్చుకున్నాను. ఫలితాలపై ఎలాంటి ఒత్తిడికి గురికాలేదు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌తో వాస్తవ పరిస్థితి ఏంటో తెలుసుకున్నాం. టెస్టుల్లో నిరాశపరిచాం. నా దృష్టిలో కోచ్‌గా ప్రతి రోజు నేర్చుకోవాల్సిందే. అదే జట్టుకు కావాల్సింది. అంతిమంగా విజయమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం’ అని అన్నాడు.