హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): సినీనటుడు మంచు మోహన్‌బాబు ఇంట్లో మళ్లీ ఘర్షణలు రాజుకున్నాయి. తన సోదరుడు విష్ణు, అతని అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని పహాడీషరీఫ్ పోలీసులకు మనోజ్ ఫిర్యాదు చేశాడు. ప్రణాళిక ప్రకారం తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారని తెలిపాడు. డిసెంబర్ 8న ఉదయం 9.30గంటలకు తనపై దాడి జరిగిందని, డయల్ 100కు కాల్ చేశానని, కేసు కూడా నమోదైందని వివరించాడు. అప్పుడు కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేయలేదని, కిరణ్, విజయ్‌రెడ్డితో పాటు పలువురిపై ఫిర్యాదు చేశానన్నారు. ఆ తర్వాత విష్ణు అనుచరులతో దాడి చేయించాడని పేర్కొన్నాడు. తనను ఇంట్లో నుంచి పంపించేందుకు కుట్ర చేస్తున్నాడని ఆరోపించాడు. తాము బయటకు వెళ్తే తనకు, తన భార్య, పిల్లలకు ప్రాణహాని ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు రక్షణ కల్పించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరాడు.