Nandi Awards | ఆంధ్రప్రదేశ్లో కొంతకాలంగా నిలిచిపోయిన ప్రతిష్ఠాత్మక నంది అవార్డుల వేడుకని త్వరలోనే పునఃప్రారంభించనున్నట్లు రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటకం, సాంస్కృతిక శాఖల మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ అంశంపై ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని తెలిపారు. సినిమా, టెలివిజన్, నాటక రంగాలకు చెందిన కళాకారులకు గౌరవం, గుర్తింపు అందించడంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. నంది అవార్డులు తిరిగి ప్రారంభం కావడం ద్వారా తెలుగు కళారంగానికి కొత్త ఊపిరి వస్తుందని ఆయన పేర్కొన్నారు.
అదేవిధంగా, విశాఖపట్నం సినిమా నిర్మాణానికి అనువైన అద్భుతమైన లొకేషన్లతో నిండిన నగరమని, వాటిని ప్రోత్సహించి మరిన్ని నిర్మాణ సంస్థలను ఆకర్షించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో సినిమా రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా, కళాకారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన వెల్లడించారు.కాగా, ఇటీవల తెలంగాణలో నిర్వహించిన గద్దర్ ఫిలిం అవార్డుల కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు కూడా ఈ పరిణామానికి కారణమైనట్టు భావిస్తున్నారు. ఆ సందర్భంగా ఆయన, కళాకారులను ప్రోత్సహించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంత వెనుకబడిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి దుర్గేశ్ చేసిన తాజా ప్రకటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.
ఇక నంది నాటకోత్సవాలను కూడా తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. అవార్డుల ఎంపిక విధానం, జ్యూరీ కూర్పు, దరఖాస్తుల ఆహ్వానం వంటి పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. కాగా, నంది అవార్డుల పునఃప్రారంభంపై వచ్చిన ఈ ప్రకటనతో తెలుగు సినిమా, టీవీ, నాటక రంగాలకు చెందిన కళాకారుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో కళారంగ అభివృద్ధికి కీలకంగా మారనుంది.