సిద్దిపేట, జూలై 6: మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెబుతున్న సీఎం రేవంత్, రాష్ట్రంలో పనిగంటలను 8 నుంచి 10కి పెంచుతూ జీవో జారీ చేయడం దేనికి సంకేతమో ప్రజలకు వివరించాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చుక రాములు అన్నారు. ఆదివారం సిద్దిపేటలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కాముని గోపాలస్వామి అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశానికి చుక రాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనిగంటలు పెంచి కార్మికుల శ్రమను యాజమాన్యాలు దోచుకుంటున్నాయని, ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని ఆయన ఆరోపించారు.
కార్మికుల హకుల పరిరక్షణ కోసం ఈనెల 9న చేపట్టే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కార్మికులు, అన్నివర్గాల ప్రజలు మద్దతు తెలిపి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదన్నారు. మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాల్లో మార్పులు చేసి కోడ్లుగా మార్చి కార్మికుల హకులను హరిస్తున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈజీఎస్కు నిధులు తగ్గించి పేదల ఉపాధిని మోదీ ప్రభుత్వం దెబ్బతీస్తున్నట్లు ఆరోపించారు.
దేశ సంపద, వనరులను కార్పొరేట్ శక్తులకు అప్పగించి, ప్రైవేటీకరణ విధానాలను యథేచ్చగా అమలు చేస్తున్నట్లు ఆరోపించారు. దళితులు, గిరిజనులు, మహిళలు, మైనార్టీలు అన్నివర్గాలపై దాడులు పెరిగిపోతున్నాయని, కార్మిక వ్యతిరేక విధానాలపై తాము పోరాడుతామన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు రాళ్ల బండి శశిధర్, సందబోయిన ఎల్లయ్య, శెట్టిపెళ్లి సత్తిరెడ్డి,గోడ్డు బర్ల భాసర్, కొంగరి వెంకట మావో, ఆలేటి యాదగిరి, బండ కింది అరుణ్ కుమార్, చొప్పరి రవి కుమార్, తాడూరి రవీందర్, సింగిరెడ్డి నవీన, అత్తిని శారద, తిప్పారం శ్రీనివాస్, బద్దిపడగ కృష్ణారెడ్డి, జాలిగపు శిరీష, దాసరి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.