Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) మరికొద్ది రోజుల్లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పూర్తిస్థాయి ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. సంక్రాంతి బరిలో భారీ అంచనాలతో నిలుస్తున్న ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన మార్కెట్, మ్యానియా ఏంటో నిరూపించేందుకు చిరంజీవి సిద్ధమయ్యారు.ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ప్రమోషనల్ వీడియోలు సినిమాపై సాలిడ్ బజ్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, మెగాస్టార్ టైమింగ్ కలిసి ఈ సినిమా హిట్ అవుతుందనే నమ్మకాన్ని అభిమానుల్లో పెంచాయి. అయితే, సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు జోరుగా సాగుతున్నప్పటికీ… ఈ కార్యక్రమాల్లో ఎక్కడా మెగాస్టార్ చిరంజీవి కనిపించకపోవడం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
సాధారణంగా చిరంజీవి సినిమాల ప్రమోషన్లలో స్వయంగా పాల్గొని మీడియా ఇంటర్వ్యూలు, ఈవెంట్లలో సందడి చేస్తుంటారు. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉండటంతో “చిరు ఎందుకు ప్రమోషన్లకు దూరంగా ఉంటున్నారు?” అనే ప్రశ్నలు మొదలయ్యాయి. దీనిపై సినీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం, చిరంజీవి ఇటీవల మోకాలి సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా మోకాలి నొప్పులతో ఇబ్బంది పడుతున్న ఆయన, సినిమా షూటింగ్ పూర్తవగానే డాక్టర్ల సలహా మేరకు శస్త్రచికిత్స చేయించుకున్నారని టాక్.డాక్టర్లు ఆయనకు పూర్తిస్థాయి విశ్రాంతి అవసరమని సూచించడంతో, ప్రస్తుతం చిరంజీవి ఎలాంటి ఫిజికల్ స్ట్రెస్ తీసుకోకుండా రెస్ట్‌లో ఉన్నారని సమాచారం. ఈ కారణంగానే సినిమా ప్రమోషన్ల బాధ్యతలన్నింటినీ దర్శకుడు అనిల్ రావిపూడి తానే భుజాన వేసుకున్నట్లు తెలుస్తోంది.
సమాచారం ప్రకారం చిరంజీవి కనీసం మరో నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉందని, దీంతో సినిమా రిలీజ్ సమయంలో కూడా ఆయన పబ్లిక్ అప్పియరెన్స్ ఉండకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.ఈ వార్తలు బయటకు రావడంతో మెగాస్టార్ అభిమానుల్లో కాస్త ఆందోళన నెలకొంది. అయితే, చిరంజీవి ఆరోగ్యం మెరుగుపడుతోందని, పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టనున్నారని సినీ వర్గాలు భరోసా ఇస్తున్నాయి. ఇక ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రమోషన్లలో చివరి దశలో అయినా చిరంజీవి కనిపిస్తారా? లేక పూర్తిగా దూరంగానే ఉంటారా? అన్నదానిపై త్వరలోనే స్పష్టత రావాల్సి ఉంది.