మెగాస్టార్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి పాత్రనైనా తనదైన అభినయంతో రక్తికట్టిస్తారు. కామెడీని పండించడంలోనూ ఆయన దిట్ట. అయితే గత కొంతకాలంగా మాస్, యాక్షన్ కథలకు ప్రాధాన్యతనిస్తున్న ఆయన వినోదానికి దూరమయ్యారని అభిమానుల్లో కొంచెం అసంతృప్తి ఉంది. ఇప్పుడాలోటుని తీర్చడానికి ‘మన శంకరవరప్రసాద్‌గారు’తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమాలో ఆయన తనదైన వింటేజ్ కామెడీతో అభిమానుల్లో జోష్ నింపబోతున్నారు.
సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు సినిమాపై భారీ హైప్‌ని క్రియేట్ చేశాయి. చిరంజీవి స్వాగ్, దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన మార్క్ కామెడీ కలబోతగా ఈ సినిమా సంక్రాంతి బరిలో వినోదాల విందు చేయనున్నదని మేకర్స్ చెబుతున్నారు.
అన్నింటికంటే ముఖ్యంగా ఈ సినిమా కోసం చిరు మేకోవర్ చూసి అభిమానులు ఖుషీగా ఉన్నారు. యంగ్ లుక్‌తో సరికొత్త ఛరిష్మాతో చిరంజీవి కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఆయన స్టిల్స్‌ని విడుదల చేశారు. ఇందులో తనదైన మ్యాజికల్ ప్రజెన్స్‌తో ఆకట్టుకుంటున్నారు. అగ్ర హీరో వెంకటేష్ అతిథి పాత్ర ఈ సినిమాకు ప్రత్యేకాకర్షణగా నిలవనుంది. ఈ చిత్రానికి కెమెరా: సమీర్ రెడ్డి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి.