ఇండియన్ స్క్రీన్‌పై సూపర్ ఉమెన్ కాన్సెప్ట్‌తో వచ్చి అఖండ విజయాన్ని అందుకున్న సినిమా ‘కొత్తలోక: చాప్టర్ 1’. కేవలం మౌత్ టాక్‌తోనే కాసుల వర్షం కురిపించిందీ సినిమా. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 300కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అంతేకాదు, ఒక మలయాళ చిత్రానికి ఈ స్థాయి వసూళ్లు రావడం కూడా ఇదే ప్రథమం.
రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా అనుభవాలను నెమరువేసుకున్నది చిత్ర కథానాయిక కల్యాణి ప్రియదర్శన్. ‘ఈ కథ వినగానే భయమేసింది. నేనేంటీ?.. సూపర్ ఉమెన్ ఏంటీ? నన్ను ఆ పాత్రలో జనం ఒప్పుకుంటారా? మనసు నిండా ఇవే ప్రశ్నలు. చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. దాంతో ఇష్టం లేకపోయినా.. భయంతోనే ఒప్పుకున్నా.
ఈ భయం నాకే కాదు, మా యూనిట్లో ఒకరిద్దరికి తప్ప అందరికీ ఉంది. దాంతో రిలీజ్ రోజున అనుభవించిన టెన్షన్ అంతాఇంతాకాదు. తొలి రివ్యూ వచ్చేంతవరకూ గదిలో నుంచి బయటకు రాలేదు. మేం ఎంత భయపడ్డామో అంత పాజిటివ్‌గా రివ్యూలొచ్చాయి. అవి చదవగానే మా అందోళనంతా పటాపంచలైపోయింది. మధ్యాహ్నం 3గంటలకు అందరం గదిలోంచి బయటకొచ్చి సంబరాలు చేసుకున్నా ం’ అంటూ గుర్తుచేసుకున్నది కథానాయిక కల్యాణి ప్రియదర్శన్.