ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే
తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాం భసి॥
(భగవద్గీత 2-67)

మనో నిగ్రహమే మానవుని పురోగతికి సరైన మార్గం. మనిషి ఎప్పుడైతే మనసు ను తన అధీనంలోకి తెచ్చుకోలేడో అప్పుడు అతని పతనం ప్రారంభం అవుతుం ది. స్థిర నిర్ణయాలు తీసుకునే శక్తి నశిస్తుంది. కట్టు తప్పిన పశువులా మారిపోయే ప్రమాదం ఉంది. అందుకే, కృష్ణ పరమాత్ముడు ఈ విషయాన్ని వివరిస్తూ.. ‘అర్జునా! నీటిలో పయనిస్తున్న పడవను గాలి పక్కదారి పట్టించే విధంగా.. విషయ లంపటంలో చిక్కుకుపోయి, కేవలం విషయాలలో మాత్రమే తిరుగాడే ఇంద్రియాలను తన అదుపులో పెట్టుకోకపోతే, ఒక్క ఇంద్రియమైనా సరే అదుపుతప్పితే అది ఆ వ్యక్తి బుద్ధిని హరించి అతనిని పక్కదారి పట్టిస్తుంది’ అని చాలా స్పష్టంగా బోధించాడు.
చేయవలసిన కర్తవ్యాన్ని పక్కకుపెట్టి అర్జునుడు నిస్పృహతో యుద్ధ విముఖుడై నప్పుడు శ్రీకృష్ణుడు గురువై బోధించిన ఈ విశేషాలు సార్వకాలికాలు, సార్వజ నీనాలు. ఎందుకంటే విషయలాలస మనిషికి త్వరగా కనిపింపజేస్తుంది, వినిపింపజేస్తుంది, తినిపింపజేస్తుంది. అందుకే ఇంద్రియాలలో ఏదో ఒకటి దానికి లోబడిపోతుంది. ఇది అత్యంత సహజ పరిణామం. పరమ స్వాభావి కమైన గుణం. నీటిలో పయనించే పడవకు బలమైన తెరచాపను సమకూర్చక పోయినా, లంగరు గట్టిగా కట్టకపోయినా.. గాలివాలుకు ఇష్టమొచ్చిన దిశకు పడవ పోతుంటుంది. గాలే దాన్ని లాక్కొని పోతుంది. అందుకే వ్యక్తి తన ఇంద్రియ లౌల్యాన్ని అదుపులో పెట్టుకోకపోతే అది అతడిని ఎటువైపు తీసుకుని పోతుందో చెప్పలేం. మనిషి అంతర్ముఖుడై ఇంద్రియాలను అదుపులో పెట్టకోక పోతే నీటిలో గాలివాలుకు కొట్టుకుపోయిన నావ గతి పడుతుంది. గాలికి ఓడ బానిసైనట్లే ఇంద్రియాలకు మనిషి బానిస. ఈ భయానక పతనం నుంచి దూరం కావాలంటే అతనికి మనో నిగ్రహం కావాలి. అందుకు భగవచ్చింతన అవశ్యం.
అనవసరమైన ఆశల్ని, ఆలోచనల్ని మనసు నుంచి దూరం చేయాలి. అప్పుడే భగవచ్చింతనా మార్గం సుగమమవుతుంది. స్థిరచిత్తుడైన మనిషి సాధించలేనిది ఉండదు. ఆ క్రమంలో ఆత్మజ్ఞానం కూడా పొందవచ్చు. మన మనసును మనమే అదుపులో పెట్టుకోలేకపోతే చెప్పలేనంత హాని కలిగే ప్రమాదం ఉంది. బతుకు భారంగా కాకుండా ఉండటానికి, జీవితం బాధలమయం కాకుండా ఉండటానికి ఇంద్రియ నిగ్రహం అవసరం. దీనిని గుర్తించి స్థితప్రజ్ఞతో మనిషి తన రీతిని సరిదిద్దుకోవాలి.
సాధారణంగా భగవత్ సృష్టి బాహ్యదృష్టితో జరిగిందని విజ్ఞుల విశ్వాసం. అందుకే ఈ సృష్టిలో అనేక బాహ్య వ్యాపారాలు కనిపిస్తాయి. అయితే ఈ బాహ్యాలను పూర్తిగా విశ్వసించి, మనిషి వాటి వెంట పడకూడదు. స్థిరచిత్తుడు కావాలి. తాత్కాలిక ఆకర్షణకు లొంగిపోకూడదు. వాటిని అధిగమించే మానసిక స్థితి రావాలి. అందుకు సాధన చేయాలి. చలించే లక్షణం పుష్కలంగా కలిగి ఉండే ఇంద్రియాలు విచ్చలవిడిగా చరిస్తూ, చలిస్తూ ఉంటాయి. తమ తమ సహజ లక్షణాలను బట్టి కండ్లు, నోరు మొదలైనవి వాటి వాటి బాహ్య వ్యాపారాలకు ఆకర్షితం అవుతుంటాయి. కానీ, మనసు వాటి వెంట పడొద్దు. ఇక్కడే మన మానసిక స్థితి అదుపులో ఉండాలి. ఆ చలనాలను అధిగమించాలి. అప్పుడే ఉన్నతస్థాయికి చేరుకోగలం. కనిపించే ప్రతి సుందరమైన వస్తువు కావాలని కండ్లు కోరుకుంటాయి. కానీ, మనసు కోరుకోకూడదు. దాని వెంట పడకూడదు. చంచలస్థితి నుంచి దూరం కావాలి. యోగ యుక్తుడైన వ్యక్తిని కూడా అయుక్తుణ్ని చేసే శక్తి ఈ ఇంద్రియాలకు ఉంటుంది. అందుకే జీవితంలో ఏ విజయం సాధించాలన్నా మనం ఇంద్రియాలను జయించాలని, మన మనసుపై ఏ ఇంద్రియం ఆధిపత్యాన్ని చలాయింపరాదని, అసలు మనిషి ఇంద్రియాలకు ఎప్పటికీ బానిస కారాదని భగవద్గీత బోధిస్తున్నది. ఆ విధంగా బానిస అయిన వానిని స్వామి ‘అయుక్తు’నిగా భావించడం సంపూర్ణ సత్యం.