– ప్రభుత్వ నిర్లక్ష్యంతో వాడుకకు రాని వైనం
– సుందరీకరణకు రూ.1.50 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం
– ఇరిగేషన్ డీఈ రవీందర్
చుంచుపల్లి, ఆగస్టు 31 : ఆహ్లాదానికి, ఆరోగ్యకరమైన వాతావరణానికి వేదికగా నిలవాల్సిన చింతలచెరువు మినీ ట్యాంక్‌బండ్ ప్రస్తుతం నిర్వహణ లోపంతో నిర్లక్ష్యానికి గురవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో అభివృద్ధి చేసిన ఈ ప్రాంతం ప్రస్తుతం వినియోగానికి నోచుకోకపోవడంతో పాటు రాత్రివేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోందని ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే జలగం వెంకట్రావు చింతలచెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేసేందుకు రూ.2 కోట్లకు పైగా నిధులతో పనులకు శ్రీకారం చుట్టారు. చెరువు చుట్టూ బండ్, వాకింగ్ ట్రాక్. దీంతో ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసుకునేందుకు, కుటుంబాలతో ఆహ్లాదంగా గడిపేందుకు ఈ ప్రాంతం అనువైన ప్రదేశంగా మారుతుందని అప్పట్లో భావించారు.
కొంతకాలంగా మినీ ట్యాంక్‌బండ్ నిర్వహణపై అధికారులు దృష్టి సారించకపోవడంతో వాకింగ్ ట్రాక్‌పై పిచ్చిమొక్కలు పెరిగిపోయి నడిచేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. రాత్రివేళల్లో సరైన పర్యవేక్షణ లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అనువైన ప్రదేశంగా మారుతోందని ఆరోపిస్తున్నారు. మందుబాబులకు అడ్డాగా మారడమే గాక ఇటీవల ఈ ప్రాంతంలో గంజాయి సేవిస్తున్న వారిని పోలీసులు పట్టుకోవడం పరిస్థితికి అద్దం పడుతోందని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రజలు ఆహ్లాదంగా గడపాల్సిన ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారడం ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు.
మినీ ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో ఆక్రమణలు జరుగుతున్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. చెరువు పరిధి, బఫర్‌జోన్‌ను పరిరక్షించాల్సిన అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. చెరువుకు సమీపంలో బఫర్‌జోన్ పరిధిలో పెద్ద భవనాలు నిర్మిస్తున్నారన్న ఆరోపణలపై అధికారులు సమగ్రంగా పరిశీలించి, నిబంధనలు ఉల్లంఘించినట్లయితే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా చింతలచెరువు మినీ ట్యాంక్‌బండ్!
మినీ ట్యాంక్‌బండ్‌ను మరింత అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నట్లు ఇరిగేషన్ డీఈ రవీందర్ తెలిపారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచనల మేరకు సుమారు రూ.1.50 కోట్లతో సుందరీకరణ పనులకు ప్రతిపాదనలు పంపించినట్లు వెల్లడించారు. ప్రతిపాదనల్లో భాగంగా మినీ ట్యాంక్‌బండ్‌కు అవసరమైన లైటింగ్, డీ-ఎంటీ చుట్టూ వాకింగ్ ట్రాక్, బెంచీల ఏర్పాటు, చెరువు మధ్యలోని ఐలాండ్‌ను సుందరీకరించడం వంటి పనులను చేపట్టాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. అలాగే ఐలాండ్‌పై ‘ఐ లవ్ కొత్తగూడెం’ అనే ఆకర్షణీయమైన బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు దాని చుట్టూ రైలింగ్ నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు పంపించినట్లు డీఈ వివరించారు. ఈ పనులకు సంబంధించి ఉన్నతాధికారుల ఆమోదం, నిధుల మంజూరు అనంతరం తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
మినీ ట్యాంక్‌బండ్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తే చుంచుపల్లి మండల ప్రజలకు మంచి ఆహ్లాదకర ప్రదేశం అందుబాటులోకి వస్తుందని స్థానికులు చెబుతున్నారు. వాకింగ్ ట్రాక్‌ను పునరుద్ధరించడంతో పాటు పార్కు ఏర్పాటు చేయాలని, చెరువులో బోటింగ్ సదుపాయం కల్పించాలని కోరుతున్నారు. చెరువు మధ్యలోని ఐలాండ్‌ను అభివృద్ధి చేసి వ్యూ పాయింట్‌గా తీర్చిదిద్దితే సందర్శకులను ఆకర్షించే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. ఇప్పటికే నిర్మించిన మౌలిక వసతులను వినియోగంలోకి తీసుకురావడంతో పాటు ప్రతిపాదిత సుందరీకరణ పనులను త్వరితగతిన చేపట్టి మినీ ట్యాంక్‌బండ్‌కు పూర్వ వైభవం తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. ఒకవైపు ఆహ్లాదకరమైన వాతావరణం, మరోవైపు ఆరోగ్యకరమైన వాకింగ్ ప్రదేశంగా తీర్చిదిద్దడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేలా నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి ప్రతిపాదిత నిధులను మంజూరు చేసి చింతలచెరువు మినీ ట్యాంక్‌బండ్‌ను సుందరీకరించి ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా చింతలచెరువు మినీ ట్యాంక్‌బండ్!