న్యూఢిల్లీ, నవంబర్ 9: ఏదైనా చర్యను అడ్డుకోలేనివారు.. అసలు అది జరుగనేలేదని కొత్త వాదనను తెరపైకి తీసుకువస్తారు. సరిహద్దుల్లో చైనా గ్రామాన్ని నిర్మించిన అంశంపై ప్రస్తుతం మోదీ సర్కారు వ్యవహరిస్తున్న తీరు ‘గజం మిథ్య.. పలాయనం మిథ్య’ అన్నట్టుగానే ఉన్నది. అరుణాచల్‌ప్రదేశ్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) సమీపంలో చైనా ఓ గ్రామాన్ని నిర్మించిందని వస్తున్న వార్తలపై సైనిక వర్గాలు తాజాగా స్పందించాయి. ఆ గ్రామాన్ని నిర్మించిన ప్రాంతం చైనా నియంత్రణలోనే ఉన్నదని మంగళవారం తెలిపాయి.
‘ఎగువ సుబన్సిరి జిల్లాలోని వివాదాస్పద సరిహద్దు ప్రాంతం చైనా నియంత్రణలోనే ఉన్నది. అక్కడే ఈ గ్రామాన్ని నిర్మించారు. 1959లో అస్సాం రైఫిల్స్ పోస్ట్‌ను పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) ఆక్రమించుకున్నది. గత కొన్నేండ్లుగా ఆ ప్రాంతంలో చైనా ఆర్మీ పోస్టును నిర్వహిస్తున్నది. మరికొన్ని నిర్మాణాలను కూడా చేపట్టింది. ఈ నిర్మాణాలన్నీ ఇటీవల చేపట్టినవి కావు’ అని ఆ వర్గాలు వెల్లడించాయి.
కాగా, అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా ఓ గ్రామాన్ని నిర్మించిందని అమెరికాకు చెందిన పెంటగాన్ ఇటీవల ఓ నివేదికలో వెల్లడించింది. అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ఉపగ్రహ చిత్రాలు కూడా ఈ వాదనకు బలం చేకూర్చాయి. అరుణాచల్‌లోని స్థానికులు, గొర్ల కాపరులు, స్థానిక మీడియా సంస్థలు కూడా సరిహద్దుల్లో చైనా ఓ గ్రామాన్ని నిర్మించిందని పేర్కొన్నారు. దీనిపై పెద్దఎత్తున రాజకీయ దుమారం రేగిన విషయం తెలిసిందే.