Parenting | మా బాబు వయసు మూడున్నరేండ్లు. నిన్నమొన్నటి వరకు బాటిల్ పాలు తాగుతుండేవాడు. డాక్టర్ సూచన మేరకు మాన్పించాము. అయితే, అప్పుడే బాబుకు కొన్ని దంతాలు బాగా పుచ్చిపోయాయి. అయితే, పాలదంతాలు కొన్నాళ్లకు ఎలాగూ ఊడిపోతాయి కదా! దానికి ట్రీట్మెంట్ అవసరమా? కొందరేమో అవసరం లేదు అంటున్నారు. సరైన సలహా ఇవ్వండి.
మీ బాబుకు మూడున్నరేండ్లు అని చెప్పారు. సాధారణంగా పిల్లలకు ఆరు నెలల నుంచి ఏడాది వయసులో దంతాలు వస్తాయి. కొందరికి ఏడాది తర్వాత వస్తాయి. ఎలాగూ ఊడిపోయేవే కదా అని, పాలదంతాల సమస్యలను పట్టించుకోకుండా ఉండకూడదు. పిల్లలకు దంతాలు రాగానే రోజుకు రెండుసార్లు బ్రష్ చేయించడం అవసరం. వాళ్లు పేస్ట్ తినే అవకాశం ఉంది కాబట్టి, జీరో ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ వాడాల్సి ఉంటుంది. పాల దంతాలు పుచ్చిపోయినట్లయితే నిర్లక్ష్యం చేయొద్దు. ఇలా దంతాలు పుచ్చిపోవడాన్ని డెంటల్ కేరీస్ అంటారు. సకాలంలో చికిత్స అందించకపోతే ఈ డెంటల్ కేరీస్ లోతుగా వెళ్లి మరింత డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉంటుంది.
ఈ సమస్య పిల్లల్లో సాధారణంగా వస్తుంటుంది. ఎక్కువగా పిండిపదార్థాలు, దంతాలకు అతుక్కుపోయే స్టికీ ఆహారం తినడం వల్ల… బ్యాక్టీరియాలు రియాక్షన్ అయ్యి, కొన్ని రకాల యాసిడ్స్ ఉత్పత్తి అవుతాయి. ఈ ఆమ్లాలు ఎనామిల్ పొరను కరిగిస్తాయి. తర్వాత డీప్‌గా వెళ్లి పల్ప్‌లో ఉన్న నరాలను ఎఫెక్ట్ చేస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు డెంటల్ కేరీస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ దంతాలు పుచ్చిపోయినట్టు అనిపిస్తే ప్రాథమిక దశలోనే చికిత్స అందించాలి. మీ అబ్బాయి విషయంలో డెంటిల్ కేరీస్ సమస్య ఉంది కాబట్టి, పీడియాట్రిక్ డెంటిస్ట్‌ను కలవండి. సాధారణ సమస్యే అయినా సత్వరమే చికిత్స అందించడం అవసరమని గుర్తించండి.