హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ) / బంజారాహిల్స్ : టీకానే రక్షణ కవచం అని, అపోహలు లేకుండా 15- 18 ఏండ్లలోపు పిల్లలందరికీ వ్యాక్సిన్ వేయించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు. సోమవారం బంజారాహిల్స్‌లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో మంత్రి టీనేజర్లకు టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ 15 ఏండ్లు పైబడిన పిల్లలందరూ వ్యాక్సిన్ తీసుకునేలా విద్యాసంస్థల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని కోరారు.
ఎమ్మెల్యే దానం నాగేందర్ విజ్ఞప్తి మేరకు ఖైరతాబాద్ దవాఖానను మరింత విస్తరిస్తామని, ఈ మేరకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు. బంజారాహిల్స్ యూపీహెచ్‌సీలో అవకాశం ఉంటే మెటర్నిటీ బ్లాక్ ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, డీపీహెచ్ శ్రీనివాసరావు, కలెక్టర్ శర్మన్, కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి, ఎస్పీహెచ్వో డాక్టర్ అనురాధ తదితరులు పాల్గొన్నారు.
మూడు జిల్లాల్లో..6053 మంది పిల్లలకు టీకా
తొలిరోజు టీనేజర్లకు విజయవంతంగా వ్యాక్సినేషన్
సిటీబ్యూరో/మేడ్చల్, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్‌లోని మూడు జిల్లాల పరిధిలో 15-18సంవత్సరాల మధ్య వయసు పిల్లలకు కరోనా టీకా విజయవంతంగా ప్రారంభమైంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కలిపి మొత్తం 6053మంది పిల్లలకు కరోనా టీకా వేశారు.నగరంలోని బంజారాహిల్స్ రోడ్‌నెం.7లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పిల్లల కరోనా టీకా కార్యక్రమాన్ని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రారంభించారు. గ్రేటర్ పరిధిలో కేవలం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి మాత్రమే టీకా వేశారు.
శివారు ప్రాంతాల్లోని పీహెచ్సీలలో ఆన్‌లైన్‌తో సంబంధం లేకుండా స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి కూడా టీకా వేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 1,84,822మందికి టీకా వేయాల్సి ఉండగా సోమవారం 2,265 మందికి, రంగారెడ్డి జిల్లా పరిధిలో 1,77,102మందికి టీకా వేయాల్సి ఉండగా 1,886మందికి, మేడ్చల్ జిల్లాలో 1,65,618మందికి టీకా వేయాల్సి ఉండగా 1,902మందికి కొవాగ్జిన్ టీకా వేసినట్లు గ్రేటర్ వైద్యాధికారులు తెలిపారు. టీకా తీసుకున్న వారంతా పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారని అధికారులు తెలిపారు.
వ్యాక్సినేషన్‌కు.. విద్యాసంస్థలు చొరవ చూపాలి
కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
కీసర, జనవరి 3 : రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి టీనేజర్లకు వ్యాక్సిన్ వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం 15 – 18 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సిన్ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలోని యువతీ యువకులకు ఆరోగ్యశాఖ వ్యాక్సిన్ వేస్తుందని చెప్పారు. ఈ వయస్సులో పిల్లలు ఉండే విద్యాసంస్థలు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హరీశ్, జడ్పీ వైస్‌చైర్మన్ వెంకటేశ్, ఎంపీపీ ఇందిరలక్ష్మీనారాయణ, డీఎంహెచ్‌వో మల్లిఖార్జున్, జిల్లా ఉప వైద్యాధికారి నారాయణరావు, ఎంపీడీవో పద్మావతి, కీసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ సరిత, నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి, కీసర సర్పంచ్ నాయకపు మాధురి వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.