Diabetes | న్యూఢిల్లీ: చిన్నారుల జీవితంలోని తొలి వెయ్యి రోజులు చక్కెరను నియంత్రించడం, ఇంకా చెప్పాలంటే మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి రెండేళ్లపాటు చక్కెర తీసుకోవడాన్ని తగ్గిస్తే పెద్దయ్యాక దీర్ఘకాలిక వ్యాధుల ముప్పును గణనీయంగా తగ్గించవచ్చని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ‘సైన్స్’ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ప్రారంభ జీవితంలో చక్కెరను తీసుకోవడం తగ్గిస్తే టైప్-2 డయాబెటిస్ ముప్పును 35 శాతం, రక్తపోటును 20 శాతం తగ్గించవచ్చు. వీటి రాకను కూడా ఆలస్యం చేయవచ్చు.
సౌత్ కాలిఫోర్నియా యూనివర్సిటీ నిర్వహించిన ఈ అధ్యయనం ప్రకారం చక్కెరను తగ్గించడం వల్ల పిల్లల్లో ఊబకాయం వచ్చే ప్రమాదం 30 శాతం తగ్గింది. రెండో ప్రపంచ యుద్ధం నుంచి కోలుకుంటున్న సమయంలో యూకేలో చక్కెర రేషన్ కారణంగా దాదాపు 60 వేల మంది ప్రభావితమయ్యారని పరిశోధకులు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) మార్గదర్శకాల ప్రకారం రెండేళ్లలోపు చిన్నారులు అదనపు చక్కెర తీసుకోకూడదు. పెద్దలు ఏడు స్పూన్లకు మించి చక్కెర తీసుకోకుండా లక్ష్యం పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ 12 స్పూన్లకు మించి లేదా 50 గ్రాములకు మించి చక్కెర తీసుకోకూడదు.