జవహర్‌నగర్, నవంబర్ 20: జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ మల్టీస్కీం మోసం వెలుగులోకి వచ్చింది. తక్కువ ధరకే టూ వీలర్ వాహనాలంటూ.. నమ్మించి.. సుమారు రూ. 2 కోట్ల వరకు మోసం చేశారు. జవహర్‌నగర్ సీఐ భిక్షపతిరావు తెలిపిన వివరాల ప్రకారం… ఏడాది కిందట పల్లవిరెడ్డి, సంజయ్(32) దమ్మాయిగూడలో నిత్యా మోటార్స్, మల్టీబ్రాండ్ పేరుతో షోరూంను ప్రారంభించారు. తక్కువ ధరకు వాహనాలు ఇస్తామని ప్రకటనలు గుప్పిస్తూ..వినియోగదారులను మభ్యపెట్టారు. 60 శాతం చెల్లిస్తే.. 40 శాతం తగ్గింపు.. 50 శాతం కడితే.. వంద రోజుల్లో వాహనం.. ఎంత మొత్తంలో చెల్లిస్తే అంత రెట్టింపు డబ్బులు.. ఇలా మూడు రకాల స్కీంలు పెట్టారు.
ఒకరు మరో నలుగురితో స్కీంలో చేరాలంటూ.. నిబంధనలు విధించారు. అనంతరం నలుగురిని చేర్పిస్తే.. తక్కువ ధరకు వాహనం వస్తుందని ఆశపెట్టారు. చివరికి 300 మంది వినియోగదారులను సుమారు రూ.20 కోట్లు వరకు మోసం చేసి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు జవహర్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు పల్లవిరెడ్డి, సంజయ్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.