హుస్నాబాద్, మే 21: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో గందరగోళ పరిస్థితి నెలకొంది. యార్డులోని గోదాములకు హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లోని కొనుగోలుకేంద్రాల నుంచి ధాన్యం బస్తాలు తరలించే ప్రక్రియలో భాగంగా పదుల సంఖ్యలో వాహనాలు యార్డుకు వస్తున్నాయి. దీంతో మార్కెట్లో ఎటు చూసినా ధాన్యం బస్తాలతో ఉన్న ట్రాక్టర్లే కనిపిస్తున్నాయి. అన్లోడింగ్ సకాలంలో కాక గంటల తరబడి ట్రాక్టర్లు యార్డులోనే ఉండాల్సి వస్తోంది.
దీంతో యార్డులోని ధాన్యం, మక్కలు ఆరబోసుకునేందుకు, కాంటా వేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. యార్డుకు రైతులు తెచ్చే వడ్లు, మక్కలు ఎక్కడ పోసుకోవాలో తెలియని పరిస్థితి ఉంది. పెద్దసంఖ్యలో లోడ్‌తో ఉన్న వాహనాలు రావడం వల్ల ప్యాడీ, మక్కల క్లీనర్లు కూడా నడుస్తలేవని, హమాలీల కొరతతో సకాలంలో కాంటాలు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరి దశలో కొత్త సమస్య తలెత్తడంతో అటు మార్కెట్ అధికారులు, ఇటు రైతులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.