హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth reddy ) తన భాష ( Language ) ను మార్చుకోవాలని, నోటిని అదుపులో పెట్టుకోవాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Talasani Srinivas Yadav ) హెచ్చరించారు. గురువారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బాధ్యత గల పదవిలో ఉంటూ గౌరవం, సంస్కారం లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు.
కరోనా సమయంలో సరిపడా ఆక్సిజన్, బెడ్ లు లేక ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్ అవసరాల కోసం ముందు చూపుతో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం సనత్ నగర్, అల్వాల్, కొత్తపేట ప్రాంతాలలో కార్పొరేట్ స్థాయి హాస్పిటల్స్ నిర్మాణ పనులు చేపట్టిందని వివరించారు. తమ ప్రభుత్వ హయాంలోనే 60 శాతం పనులు పూర్తయ్యాయి అనే విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు.
సనత్ నగర్ టిమ్స్‌ను కట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకోవడం అవివేకమని విమర్శించారు. హాస్పిటల్ లో అవసరమైన సౌకర్యాలు, వసతులు కల్పించకుండా హడావుడిగా ప్రారంభించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. హాస్పిటల్ ప్రారంభోత్సవ సభలో అధికారిక కార్యక్రమం అనే సోయి లేకుండా వైద్యులు, నర్సింగ్ విద్యార్థుల ముందు ముఖ్యమంత్రి నోటికొచ్చినట్లు పచ్చి అబద్దాలు మాట్లాడారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి రిబ్బన్ కటింగ్ లు చేస్తున్నారని ఆరోపించారు.
తమకు సంస్కారం అడ్డం వస్తుందని, లేదంటే మీకన్నా ఎక్కువ మాట్లాడగలమని చెప్పారు. ప్రజాపాలన అని ఒక వైపు ప్రచారం చేసుకుంటూ మరో వైపు నిర్బందాలు, అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
కమిషన్ ల కోసమే 22 ఏ
కమిషన్ ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం 22 ఏ తీసుకొచ్చిందని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజల ఇండ్లు, ప్రయివేట్ భూములను 22 ఏ లో చేర్చే అధికారం మీకు ఎవరు ఇచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 22 ఏ ను అడ్డం పెట్టుకొని భూముల యజమానులను భయపెట్టి 30 నుండి శాతం కమిషన్ లను వసూలు చేసిన మాట వాస్తవం కాదా? అని నిలదీశారు. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం తప్పిదాలు చేసి అధికారులపై నెపం పెట్టి ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తుందని విమర్శించారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్లు నామన శేషుకుమారి, అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, బీఆర్ఎస్ డివిజన్ పార్టీ అధ్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, గుర్రం పవన్ కుమార్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, నాయకులు పాల్గొన్నారు.