AP News | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది బంగారు సమయం అని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. విభజన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో చలసాని శ్రీనివాస్ మాట్లాడారు. విభజన హామీలు అమలైతే రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు. అందుకే నయానో, భయానో విభజన హామీలను సాధించాలని సూచించారు.
తెలుగు జాతి హక్కుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రాజీ పడొద్దని చలసాని అన్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలని కోరారు. పోలవరంపై పెద్ద కుట్ర జరుగుతోందని చలసాని అనుమానం వ్యక్తం చేశారు. రాతి కట్టడం పూర్తి చేసి ప్రాజెక్టు ఓపెన్ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం బ్లాక్మెయిల్ చేస్తోందని అన్నారు. కేంద్రం మోసాలకు రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గద్దని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఇప్పటివరకు విభజన అంశాలను మాట్లాడలేదని పేర్కొన్నారు. విభజన హామీలపై పవన్ కల్యాణ్ చొరవ తీసుకోవాలని కోరారు.