Madhabi Puri Buch | న్యూఢిల్లీ, ఆగస్టు 19: అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ చైర్పర్సన్ మాధవి పురి బచ్‌పై మరోసారి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికన్ ప్రైవే ట్ ఈక్విటీ బ్లాక్‌స్టోన్‌తో సంబంధాలు కలిగివున్నట్లు ది మార్నింగ్ కంటెక్స్ తన కథనంలో వెల్లడించింది. దేశీయ కార్పొరేట్ సంస్థల్లో మెజార్టీ వాటాను కొనుగోలు చేయడానికి పరోక్షంగా బ్లాక్‌స్టోన్‌కు సహాయ సహకారాలు అందించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని తన కథనంలో పేర్కొంది. బ్లాక్‌స్టోన్ సంస్థ గడిచిన నాలుగేండ్లలో భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టడంతోపాటు పలు కంపెనీల్లో ప్రమోటర్‌గా మారింది. ప్రైవేట్ పెట్టుబడులు అనుమతించడానికి నియంత్రణ మండళ్లు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, బ్లాక్‌స్టోన్ పెట్టుబడులపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండానే అనుమతినిచ్చినట్లు ఆరోపిస్తున్నది.
ధరలు తగ్గుతున్నాయ్: ఆర్బీఐ
ముంబై, ఆగస్టు 19: ధరలు తగ్గుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంటున్నది. ఈ నెలలో తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, వంటనూనెల ధరలు బాగా తగ్గినట్టు తాము గుర్తించామని ‘స్టేట్ ఆఫ్ ది ఎకానమీ’ పేరిట సోమవారం విడుదల చేసిన బులెటిన్‌లో ఆర్బీఐ పేర్కొన్నది. గత నెల జాలైలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.5 శాతానికి దిగొచ్చిన విషయం తెలిసిందే. అంతకుముందు నెల జూన్‌లో 5.1 శాతంగా ఉన్నది. టోకు ద్రవ్యోల్బణం కూడా తగ్గింది. ఈ క్రమంలో ఆగస్టులోనూ ద్రవ్యోల్బణ గణాంకాలు తగ్గబోతున్నాయన్నట్టు ఆర్బీఐ సంకేతాలివ్వడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది. దీంతో ఇది ఇలాగే కొనసాగితే అక్టోబర్ నెలలో జరిపే ద్రవ్యసమీక్షలోనైనా ఆర్బీఐ వడ్డీరేట్లకు కోతపెట్టే అవకాశాలుంటాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. గత ఏడాది ఏప్రిల్ నుంచి కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ యథాతథంగానే ఉంచుతున్నది.
‘డిపాజిట్లను ఆకర్షించండి’
న్యూఢిల్లీ, ఆగస్టు 19: డిపాజిట్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా బ్యాంకులు తీవ్రంగా కృషి చేయాలని ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. బ్యాంకుల పనితీరుపై సోమవారం ఢిల్లీలో ఆమె ప్రత్యేకంగా సమీక్షించారు. గడిచిన కొన్ని నెలలుగా రుణ వితరణ కంటే డిపాజిట్లలో వృద్ధి 300-400 బేసిక్ పాయింట్లు తక్కువగా నమోదైందని, ఈ రెండింటి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడానికి తీవ్రంగా కృషి చేయాలని ఆమె సూచించారు.