హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ)/కీసర: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తూ పేదల బతుకులు ఛిద్రం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ఆరోపించారు. వ్యవసాయరంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని విమర్శించారు. మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా కీసరలో జరుగుతున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం 3వ రాష్ట్ర మహాసభల్లో గురువారం చాడ వెంకట్రెడ్డి ప్రసంగించారు. వ్యక్తిగత వ్యవసాయం స్థానంలో కొర్పొరేట్ సాగును కేంద్రం ప్రోత్సహిస్తుండటంతో, పెద్ద కంపెనీలు రైతులకు పెట్టుబడి, విత్తనాలు సరఫరా చేసి పంట చేతికొచ్చిన తరువాత తక్కువ ధర చెల్లించి మోసం చేస్తాయని తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థను కూడా కేంద్రం బలహీనపర్చిందని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నా మోదీ సర్కారు పట్టించుకోవటంలేదని మండిపడ్డారు. ఏటా రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తామని, విదేశాల్లోని నల్లధనం వెలికితీస్తామని గొప్పలు చెప్పిన బీజేపీ ప్రభుత్వం, ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. కేవలం దేశభక్తులమని చెప్పుకోవడానికే ‘అజాదీకా అమృత్ మహోత్సవ్’ నిర్వహిస్తున్నారని, నిజానికి భారత స్వాతంత్య్ర పోరాటంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు ఎలాంటి పాత్ర లేదని గుర్తుచేశారు.