న్యూఢిల్లీ, జూలై 7 : పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా దేశంలో ప్రవేశపెట్టిన ఇథనాల్ మిశ్రమ కార్యక్రమాన్ని తదుపరి దశకు తీసుకువెళ్తారని ప్రచారం జరుగుతున్న వేళ కేంద్రం స్పందించింది. ఇప్పటికిప్పుడు ఈ-25 పెట్రోల్‌ను ప్రవేశపెట్టే యోచన లేదని, ప్రస్తుతం అదంతా పరీక్ష దశలో ఉన్నందున దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో ప్రవేశపెట్టిన ఈ20 పెట్రోల్‌పై ఎలాంటి ఆందోళన చెందనక్కరలేదని తెలిపింది. రెండున్నరేండ్ల పాటు విస్తృతంగా ప్రయోగాలు, పరీక్షలు, ధ్రువీకరణ చేసిన తర్వాత దేశంలో ఈ మిశ్రమాన్ని వినియోగిస్తున్నారని ఒక ఉన్నతాధికారి తెలిపారు. ఇప్పటికే దేశంలో ఈ25ను ప్రవేశపెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. అది పూర్తిగా అవాస్తవమని, అది ఇంకా పరీక్షల దశలోనే ఉందని తెలిపారు. దీని అనుకూలత పరీక్షలు వివిధ వాహనాల తయారీ సంస్థల్లో.. వివిధ వాహనాలపై జరుగుతున్నాయన్నారు. దీనిపై తుది పరీక్షల నివేదిక వెలువడిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. భవిష్యత్తులో కూడా వాహనాల భద్రత, ఇంజిన్ పనితీరు, దీర్ఘకాల మన్నిక తదితర అంశాలపై శాస్త్రీయమైన రుజువులు నిర్ధారణ పొందిన తర్వాతే పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం శాతాన్ని పెంచుతామని ఆయన తెలిపారు.
ఈ10 ఆధారిత వాహనాల్లో ఈ20 ఇంధనాన్ని వినియోగించినప్పుడు ఇంధన వ్యవస్థలో రబ్బర్‌తో చేసిన భాగాల్లో క్షీణత నమోదైందని భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ఆటోమొబైల్ పరిశోధన, పరీక్ష సంస్థ ఆటోమోటివ్ రిసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఆర్ఏఐ) వెల్లడించింది. ఇప్పటికే ఈ20 ఇంధన వాడకాన్ని సిఫార్సు చేసిన ఈ సంస్థ తాజాగా కొనసాగిస్తున్న పరిశోధనల్లో ఈ10 ఆధారిత వాహనాల్లో ఈ20ని వాడినప్పుడు హోసెస్, గ్యాసకట్లు, సీల్స్, బేరింగ్లు వంటివి దెబ్బతింటున్న విషయాన్ని గుర్తించింది. దీనికి సంబంధించిన నివేదిక ఇంకా బహిరంగం కాకపోయినా రానున్న రోజుల్లో ఈ భాగాలను వేరే లోహాలతో తయారు చేసి భర్తీ చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. వారు నిర్వహించిన పరీక్షల ప్రకారం వాహనంలో లోహంతో తయారు చేసిన భాగాలకు ఈ ఇంధనంతో ఎలాంటి ఇబ్బంది ఏర్పడలేదు. అలాగే ఈ10 అనుకూల వాహనాల్లో ఈ20 ఇంధనాన్ని ఉపయోగించినప్పుడు, వాటి నుంచి వెలువడే ఉద్గారాలు చట్టపరమైన పరిమితులకు లోబడి ఉన్నాయి. ఈ10 వాహనాలతో పోలిస్తే ఈ20తో ఇంధన వినియోగం 2-6 శాతం పెరిగింది.
ప్రభుత్వ ఇథనాల్ పాలసీపై ఏర్పడిన వివాదం, విమర్శలను తప్పుడు నివేదన, అపార్థంగా కేంద్రం పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి పేర్కొన్నారు. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని ఆయన షేర్ చేశారు. ఈ20 ఇంధనానికి కీటకాలు ఆకర్షితమవుతాయని, వాహనాల ఇంజిన్లు పాడైపోతాయని, మైలేజ్ తగ్గిపోతుందని జరుగుతున్న ప్రచారం చూస్తే దానిపై అపార్థంతోనే ఇదంతా చేస్తున్నారన్నారు. ఈ ఇంధనాన్ని ఏడాదిగా వాడుతుండగా, ఇప్పుడే దీనిపై వివాదాస్పద ప్రచారం జరుగుతున్నదని ఆయన పేర్కొన్నారు. దేశంలో 20 కోట్ల ద్విచక్ర వాహనాలు ఉండగా, ఇప్పటికే 20 లక్షల నాలుగు చక్రాల వాహనాలు ఈ ఇంధనాన్ని వినియోగిస్తున్నాయన్నారు. ఈ25 ఇంధనాన్ని త్వరలో ప్రవేశపెడుతున్నట్టు ప్రచారం జరుగుతున్నదని, అయితే దానికి పరీక్షలు జరుగుతున్నాయని, దాని విడుదలకు సమయం పడుతుందని మంత్రి హర్దీప్ సింగ్ పురి వెల్లడించారు.
పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలుపడం వల్ల ఇంధన సామర్థ్యం తగ్గుతున్నదంటూ వస్తున్న ఆరోపణలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తోసిపుచ్చారు. ఈ20 పెట్రోల్‌తో సమస్య వచ్చిన ఒక్క కారు పేరు అయినా చెప్పాలని ఆయన అన్నారు. పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమంపై కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ‘ఈ20 పెట్రోల్ వాడకం వల్ల ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. ఆ పెట్రోల్ కారణంగా సమస్య ఎదుర్కొంటున్న ఒక్క కారునైనా చూపించండి. ఇథనాల్ మిశ్రమంపై జరుగుతున్న ప్రచారం కేవలం పెయిడ్ క్యాంపెయిన్ మాత్రమే. అందులో వాస్తవం లేదు’ అని ఆయన పేర్కొన్నారు. ఇథనాల్ తయారీతో రైతులకు దాదాపు రూ. రూ.45 వేల కోట్ల అదనపు ఆదాయం వస్తుందని ఆయన తెలిపారు.