హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రైతాంగంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సవతి ప్రేమ చూపిస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా, లేని పంటను కొంటామంటూ కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణ వ్యవసాయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి ఏ మాత్రం అవగాహన లేదని ట్విట్టర్లో విమర్శించారు. తెలియని విషయాల గురించి రైతులను అడిగితే అర్థమయ్యేలా చెప్తారని చురకలేశారు. తెలంగాణలో యాసంగిలో అధిక శాతం బాయిల్డ్ రైస్ ఉత్పత్తి అవుతుందని తెలిసీ కూడా కేంద్రం, ఎఫ్‌సీఐ మొండిగా వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. బీజేపీ నాయకుల మిడిమిడి జ్ఞానంతో రైతన్నలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.