BRICS Summit : ఢిల్లీలో ప్రతిష్టాత్మక బ్రిక్స్ సదస్సు వచ్చే వారం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సు కోసం కేంద్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో సదస్సు ప్రారంభానికి ముందు రోజే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర మానవ వనరులు, ఫిర్యాదుల శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం ఆగష్టు 11, శుక్రవారం ఢిల్లీతోపాటు, బ్రిక్స్ సదస్సు జరిగే ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటికీ సెలవు ప్రకటించింది.
ఆగష్టు 12, 13 తేదీల్లో బ్రిక్స్ సదస్సు జరుగుతుంది. కానీ, వివిధ దేశాధినేతలు ఒక రోజు ముందుగానే.. అంటే, ఆగష్టు 11నే ఇండియా చేరుకుంటారు. దీంతో ఆగష్టు 11 నుంచే వారికి తగిన ఏర్పాట్లు చేయాలి. ఆ రోజు శుక్రవారం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పనిదినం. కానీ, ఉద్యోగులు, వారికి సంబంధించిన పనుల కోసం వచ్చే వారి వల్ల ట్రాఫిక్, భద్రత సహా అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అలాగే, సదస్సు కోసం అనేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం అనేక వాహనాలు తిరుగుతాయి.
అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు, ప్రజలు కూడా వస్తే మరింత సమస్యగా మారుతుంది. అందుకే, సదస్సుకు ఒక రోజు ముందు.. ఆగష్టు 11న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఆ తర్వాత 12, 13 తేదీలు.. శని, ఆదివారాలు. ఎలాగో, ఈ రెండు రోజులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు పని చేయవు. కాబట్టి, సమస్య ఉండదు. అందుకే.. శుక్రవారం సెలవుగా ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది అంతర్జాతీయ స్థాయి సదస్సు.
చైనా సహా వివిధ అగ్రదేశాలకు చెందిన అధినేతలు ఈ సదస్సుకు హాజరవ్వబోతున్నారు. ఇందుకోసం వారికి భద్రత, వసతి సహా అనేక ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఈ ఏర్పాట్ల కోసం తీసుకునే చర్యలకు ఆటంకం కలగకూడదని కేంద్రం శుక్రవారం సెలవు ఇచ్చింది. ఇదే సమయంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించింది. పలు చోట్ల ట్రాఫిక్ మళ్లించనున్నారు.