హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): ఈ నెలాఖరుతో ముగియనున్న కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్) గడువును భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) పొడిగించకపోతే, రాష్ట్ర ఖజానాపై భారీగా ఆర్థికభారం పడే ప్రమాదం కనిపిస్తున్నది. గత యాసంగికి సంబంధించి రాష్ట్రం నుంచి ఇంకా 12 లక్షల టన్నుల సీఎమ్మాఎర్ను ఎఫ్సీఐకి ఇవ్వాల్సి ఉన్నది. ఇందులో 3.75 లక్షల టన్నులు బాయిల్డ్రైస్ కాగా మిగిలింది రా రైస్. నెలాఖరునాటికి ఇంత మొత్తం అందివ్వగలగడం కష్టమన్న అభిప్రాయాన్ని మిల్లర్లు వ్యక్తంచేస్తున్నారు. గడువును మరోసారి పొడిగించేది లేదని ఇప్పటికే ఎఫ్సీఐ తేల్చి చెప్పడంతో కనీసం 8 లక్షల టన్నుల సీఎమ్మార్ మిగిలిపోయే అవకాశం ఉన్నదని అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపు రూ.3 వేల కోట్ల భారం పడుతుందని భావిస్తున్నారు.
గతేడాది కూడా సీఎమ్మార్ గడువును పొడిగించకపోవడంతో దాదాపు లక్ష టన్నులు మిగిలిపోయాయి. ఈ నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తున్నది. వాస్తవానికి గతేడాదితో పోల్చుకుంటే ఈ సారి ధాన్యం దిగుబడి 40 శాతం పెరిగింది. దీనికి తగ్గట్టుగా సీఎమ్మార్ గడువును ఎఫ్సీఐ పొడిగించకపోగా, మార్చి నెలాఖరుకే కుదించడం సమస్యాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన సీఎమ్మార్లో బాయిల్డ్రైస్ వాటాను మరింత పెంచాలని పౌరసరఫరాల సంస్థ ఎఫ్సీఐని కోరుతున్నది. దీనిపై ఎఫ్సీఐతో చర్చించేందుకు సోమవారం రాష్ట్ర పౌరసరఫరాలశాఖకు చెందిన అధికారులు ఢిల్లీ వెళ్లనున్నారు. ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, సీఎమ్మార్ను ఇవ్వడంలో కొంతమంది మిల్లర్లు జాప్యం చేస్తున్నారని ఒక అధికారి ఆందోళన వ్యక్తంచేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మిల్లర్లపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు.