న్యూఢిల్లీ, మే 16 : నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు రిజర్వుబ్యాంక్ గట్టి షాకిచ్చింది. దేశవ్యాప్తంగా ఆర్థిక సేవలు అందించడంలో విఫలంకావడంతో 150కి పైగా ఎన్బీఎఫ్సీ సంస్థల లైసెన్స్‌లను రద్దు చేసింది. సెక్షన్ 45-ఐఏ(6) రిజర్వుబ్యాంక్ చట్టం 1983 ప్రకారం ఆయా సంస్థలు బ్యాంకింగేతర ఆర్థిక సేవలు అందించకుండా నిషేధించింది. మరోవైపు, తమ లైసెన్స్‌లను తిరిగి అప్పగించిన మరో ఏడు ఎన్‌బీఎఫ్‌సీల రిజిస్ట్రేషన్లను కేంద్ర బ్యాంక్ రద్దు చేయగా, కోర్టు ఆదేశాల మేరకు జైపూర్‌కు చెందిన ఒక ఎన్బీఎఫ్సీ రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించింది. సెంట్రల్ బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఆ 150 ఎన్బీఎఫ్సీ సంస్థలు ఇక నుంచి నాన్ బ్యాంకింగ్ సేవలు అందించకూడదని తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ వెల్లడించింది.
బాధిత సంస్థల్లో అత్యధికంగా పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో నమోదైనవి అయినప్పటికీ..వీటితోపాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, బీహార్, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ర్టాలకు చెందిన సంస్థలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. వీటిలో కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న అకిన్ విన్కామ్, అడ్మైర్ వినిమే, బ్లూ డైమండ్ సెక్యూరిటీ అండ్ ఫైనాన్స్, తౌరస్ ఇస్పాత్ ప్రైవేట్‌తోపాటు ఢిల్లీకి చెందిన గోల్ సెక్యూరిటీస్ అండ్ క్రెడిట్, ఎండీ ఫిన్‌కాప్ ప్రైవేట్, పారస్ ఫిన్‌కాప్ సంస్థలు ఉన్నాయి. అలాగే లైసెన్స్‌ను సరెండ్ చేసిన ఏడు సంస్థల్లో అశోక వినియోగ, గురు కృప ఫిన్వెస్ట్ సంస్థలు కూడా ఉన్నాయి. మరోరెండు ఆర్ఆర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, అంజలి కాఫిన్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి. వీటితోపాటు విలీనం రద్దుకావడంతో హెచ్డీఎఫ్సీ హోల్డింగ్‌స లిమిటెడ్ లైసెన్స్‌ను కూడా వెనక్కితీసుకున్నది.