న్యూఢిల్లీ, మే 16: కృత్రిమ మేధస్సు ఇకపై కేవలం సాంకేతిక పరమైన అంశమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలకు ఇది ఒక నిర్వహణ మూలాధారంగా పనిచేస్తున్నదని టీసీఎస్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను టీసీఎస్ వార్షిక షేరుహోల్డర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెక్నాలజీ రంగంలో వస్తున్న పెనుమార్పులకు అనుగుణంగా టీసీఎస్ రూపాంతరం చెందుతున్నదని, ఈ సేవల నుంచి ప్రతియేటా 2.3 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతుండటంతో దీనిపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు చెప్పారు. వీటితోపాటు క్లౌడ్, డాటా, సైబర్ సెక్యూరిటీ విభాగాల నుంచి 11.5 బిలియన్ డాలర్ల ఆదాయం లభిస్తున్నదన్నారు. సంస్థలు పెట్టుబడి పెట్టే విధానం, సరఫరా గొలుసులను నిర్వహించడం, నష్ట నివారణ, వాటాదారులకు సేవలు అందించడం వంటి వాటిని ఏఐ ప్రాథమికంగా ప్రభావితం చేస్తున్నదన్నారు.
ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సుకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని టీసీఎస్ ప్రత్యేకంగా భారత్‌లో తొలి ఏఐ డాటా సెంటర్‌ను నెలకొల్పడానికి సిద్ధమైంది. 160 కిలోవాట్ల సామర్థ్యంతో నెలకొల్పనున్న ఈ డాటా సెంటర్ దేశవ్యాప్తంగా ఏర్పాటవుతున్న తొలి డాటా సెంటర్ ఇదే కావడం విశేషం. విద్యుత్, కంప్యూటింగ్, భౌగోళిక అంశాలపై ప్రపంచవ్యాప్తంగా పరిమితులు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఏఐ మౌలిక సదుపాయాల కోసం భారత్ ఒక వ్యూహాత్మక గమ్యస్థానంగా మారుతున్నదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తంచేశారు. మరోవైపు, ప్రస్తుతం సంస్థలో 5.84 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.
గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను టీసీఎస్ సీఈవో, ఎండీ కృతివాసన్ రూ.28 కోట్ల వార్షికవేతనాన్ని అందుకున్నారు. అంతక్రితం ఏడాది అందుకున్న వేతనంతో పోలిస్తే ఇది 6.3 శాతం అధికమని కంపెనీ వార్షిక నివేదికలో వెల్లడించింది.