టెహ్రాన్: ఇరాన్లో హిజాబ్ ధారణకు వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశంలో సెలబ్రిటీ చెఫ్ మెర్షాద్ షాహిదిని కొట్టి చంపారు. ఇరాన్ రెవల్యూషనరీ దళాలు అత్యంత దారుణంగా ఆ చెఫ్‌ను కొట్టినట్లు తెలుస్తోంది.
19 ఏళ్ల షాహిదిని నిరసన సమయంలో అరెస్టు చేసి, అతన్ని లాఠీలతో కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పుర్రెకు బలమైన గాయం కావడంతో అతను మరణించాడు. చెఫ్ షాహిది మృతితో తమకు సంబంధం లేదని ఇరాన్ అధికారులు తెలిపారు.
షాహిది కాళ్లు, చేతులు, తలపై ఎటువంటి గాయాల దెబ్బలు లేవని ఆ దేశ చీఫ్ జస్టిస్ అబ్దోల్మెహిది మౌసావి తెలిపారు. కానీ ఇరాన్‌లోని సోషల్ మీడియాలో మాత్రం ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. షాహిదిని కిరాతకంగా హతమార్చినట్లు ఆందోళనలు మిన్నంటాయి.