బాంబే: అనుమానాస్పద రీతిలో మృతిచెందిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు సెలబ్రిటీ మేనేజర్‌గా పని చేసిన దిశా సాలియన్(Disha Salian) మృతి కేసులో సీబీఐ దర్యాప్తు చేపట్టాలని ఇవాళ బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2020లో ఆమె ప్రాణాలు కోల్పోయారు. అయితే దిశా మృతి పట్ల ఆమె తండ్రి అనుమానాలు వ్యక్తం చేశారు. సారంగ్ కోత్వాల్, రంజిత్‌సిన్హా రాజా భోంస్లేతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. ఆ కేసులో ఎఫ్ఐఆర్ను సీబీఐ నమోదు చేస్తుందని, దిశా తండ్రి సతీశ్ సాలియన్ వాంగ్మూలం కూడా తీసుకుంటారని పేర్కొన్నది. కేసుకు సంబంధించిన అన్ని పేపర్లను సీబీఐకి అప్పగించాలని ముంబై పోలీసులను కోర్టు ఆదేశించింది.
సీబీఐ ఇచ్చిన నివేదిక ఆధారంగా సతీశ్ సాలియన్ స్వేచ్ఛగా మళ్లీ కోర్టులో సవాల్ చేసుకోవచ్చు అని హైకోర్టు తెలిపింది. దిశ సాలియన్ 2020 జూన్ 8వ తేదీన మృతిచెందింది. ముంబైలోని మలాద్ ఏరియాలో ఓ భవనంలోని 14వ అంతస్తు నుంచి కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడింది. ప్రమాదవశాత్తు మృతిగా తేల్చుతూ సిటీ పోలీసులు రిపోర్టు ఇచ్చారు. దిశ సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు తమ దర్యాప్తులో చెప్పారు. కానీ తన కుమార్తెను గ్యాంగ్ రేప్ చేసి, మర్డర్ చేసినట్లు సతీశ్ సాలియన్ తన పిటీషన్లో ఆరోపించారు. ఈ కేసులో పోలీసుల దర్యాపుపై సతీశ్ తరపు న్యాయవాది నీలేశ్ ఓజా అనుమానాలు వ్యక్తం చేశారు.