దుండిగల్, జనవరి 2: విపరీతంగా మద్యం సేవించి కారు డ్రైవింగ్ చేయడంతో అదుపుతప్పిన కారు బైక్‌లను ఢీ కొట్దింది. అంతటితో ఆగకుండా రోడ్డుపై వెళ్తున్న మరో కారును సైతం ఢీ కొట్టి రోడ్డుపై నిలిచిపోయింది. ఈ సంఘటన సూరారం పీఎస్ పరిధిలో శుక్రవారం సాయంత్రం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జీడిమెట్ల ఇండస్ట్రీయల్ వైపు నుండి సూరారం, సాయిబాబానగర్ సర్వీస్‌రోడ్డులో ఉన్న స్విఫ్ట్ డిజైర్ కారు మజీద్ ఎదురుగా దూసుకొచ్చి, ముందుగా రోడ్డుపక్కన నిలిపి ఉన్న రెండు బైకులను ఢీ కొట్టింది. అంతటితో ఆగకుండా ఇండస్ట్రీయల్ వైపు నుండి సాయిబాబానగర్ వైపు వస్తున్న ఓ ఇన్నోవా కారును ఢీ కొట్టి రోడ్డుపై నిలిచిపోయింది. ఈ ఘటనలో రెండు కార్లతోపాటు బైక్‌లు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. అయితే స్విప్ట్ డిజైర్ వాహనం నడుపుతున్న వ్యక్తితోపాటు పక్క సీటులో కూర్చున్న మరో వ్యక్తి పూటుగా మద్యం సేవించి వాహనం నడిపినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. స్థానికులు వారిని పోలీసులకు అప్పగించగా బ్రీతింగ్ ఎనలైజర్‌తో పరీక్షించగా 530 పాయింట్లు రీడింగ్ వచ్చింది. కారు నడిపిన ఎండీ షపీ(48)పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రమాదం జరిగిన చోట ప్రైవేట్ పాఠశాల ఉందని, సాయంత్రం కావడంతో కొందరు విద్యార్థులు అప్పటికే ఇండ్లల్లోకి వెళ్లగా, మరి కొందరు విద్యార్థులు పాఠశాల గదుల్లో నుండి బయటకు వచ్చేందుకు వేచిచూస్తున్నట్లు తెలుస్తుంది. సంఘటన జరిగిన సమయంలో పిల్లలెవరూ పాఠశాల ముందు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొంటున్నారు.
దుండిగల్ పీఎస్ పరిధిలో ..
దుండిగల్ పీఎస్ పరిధి, బహదూర్‌పల్లిలోని గ్రీన్‌హిల్స్ కాలనీ వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ ఈకో స్పోర్ట్స్ కారు ముందుగా రోడ్డుపక్కనే ఉన్న రెండు బైక్‌లను ఢీ కొట్టింది. ఆ సమయంలో రోడ్డు పక్కన నిలుచున్న తాతా, మనవళ్లను ఢీ కొట్దింది. ఈ ఘటనలో తాత బానుదాస్ కాళ్లపై నుండి కారు వెళ్లగా తీవ్ర గాయాలయ్యాయి. మనవడు తనీష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో కారులో నలుగురు ఓ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఉన్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. వీరిలో ముగ్గురు అక్కడి నుండి పారిపోగా ఓ విద్యార్ధిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్నవారంతా మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది. కాగా బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.