ఊట్కూర్ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలో గంజాయి (Cannabis ) విక్రయాలు చాప కింద నీరుల కొనసాగుతున్నాయి. ఈ నెల 15న ఊట్కూర్( Utkoor ) మండల కేంద్రంలోని మక్తల్ ప్రధాన రహదారి అయ్యప్ప స్వామి టెంపుల్ సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు యువకులను టాస్క్ ఫోర్స్ పోలీసులు ( Task Force ) అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. యువకుల వద్ద నుంచి 125 గ్రాముల గంజాయిని టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకుని ఊట్కూర్ ఎస్సై రమేష్( SI Ramesh ) కు సమాచారం అందించారు.
నిందితులలో ఒకరు ఊట్కూర్ మండలం చెట్టు కింది అరవింద్ ( 22 ) , కర్ణాటక రాష్ట్రం గుర్మిట్కల్ తాలూకా కేంద్రానికి చెందిన కోరేబాన్ సంజీవ్ ( 23) గుర్తించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు జిల్లా జైలుకు తరలించారు. నిషేధిత గంజాయి విక్రయాలు చేపడితే చట్టపరమైన శిక్షలు తప్పవని ఎస్సై రమేష్ హెచ్చరించారు. గ్రామాల్లో గంజాయి విక్రయాలు చేపడితే పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని సూచించారు.
సరిహద్దు శివారులో..
తెలంగాణ సరిహద్దు శివారులోని గుడిమిట్కల్, యాద్గీర్ పట్టణాల నుంచి శివారు గ్రామాల మీదుగా ఊట్కూర్ మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాలైన పులిమామిడి, చిన్నపొర్ల, పెద్దపొర్ల, మల్లేపల్లి, ఎడవెల్లి, నిడుగుర్తి, పెద్ద జట్రం తదితర గ్రామాలకు గంజాయి సరఫరా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు పట్టణాలకు మాత్రమే పరిమితమైన గంజాయి విక్రయాలు గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించడంతో గంజాయి మత్తులో యువత తూలుతున్నారు.
దినసరి కూలీలు, కళాశాల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా గంజాయి అమ్మకాలను చేపడుతున్నారు. విద్యార్థులు, యువత గంజాయి మత్తుకు బానిస అవుతుండడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంజాయి సరఫరాను అరికట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.