హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): బయటివాడికి తెలిస్తే సమస్య అని కుటుంబసభ్యులే గ్రూపుగా మారి గంజాయిని పండిస్తున్నారు. అనుమానం రాకుండా ఉండేందుకు లారీల్లో నల్లమట్టి నింపి మధ్యలో పెట్టి తరలిస్తున్నారు. పోలీసులకు పట్టుబడకుండా లారీలకు ఎస్కార్టుగా వ్యవహరిస్తున్నారు. అలా రూ.3 కోట్లు విలువ చేసే 1,825 కిలోల గం జాయిని సరఫరా చేస్తున్న ముఠాను రాచకొండ ఎస్వోటీ, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు పట్టుకొన్నారు. ఏపీలోని సీలేరు నుంచి మహారాష్ట్రకు ఈ గంజాయిని తరలిస్తున్నట్టు గుర్తించారు.
ఎల్బీనగర్ రాచకొండ పోలీసు కమిషనరేట్ క్యాంపు కార్యాలయంలో సీపీ మహేశ్ భగవత్ కేసు వివరాలను వెల్లడించారు. మహారాష్ట్ర ఉస్మానాబాద్‌కు చెందిన సం జయ్ లక్ష్మణ్ షిండే మహారాష్ట్రలో భారీఎత్తున గం జాయి దందా చేస్తున్నాడు. సీలేరు అటవీ ప్రాంతం నుంచి కేజీ రూ.8 వేల చొప్పున కొని, మహారాష్ట్రలో రూ.15 వేలకు అమ్ముతున్నాడు. తన ఆచూకీ బయటపడకుండా తన బావమరిది సంజయ్ బాలాజీ, బాలాజీకి కూతురిని ఇచ్చిన మామ అభిమాన్, స్నేహితులు సంజయ్ చౌగులే, భరత్ కొలప్పా యావ్లేను అనుచరులుగా పెట్టుకొన్నాడు.
గంజాయి లారీని హైదరాబాద్ నుంచి సురక్షితంగా తరలించేందుకు సంజయ్ బాలాజీ కాలే, అభిమాన్ కల్యాణ్ పవార్, సంజయ్ చౌగులే, భరత్ కొలప్పా యావ్లే స్విఫ్ట్ కారులో పైలటింగ్ చేశారు. దీనిపై సమాచారం అందుకొన్న పోలీసులు అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద లారీతోపాటు కారులో ఉన్న ఐదుగురిని కూడా అదుపులోకి తీసుకొన్నారు. ప్రధాన నిందితుడు సంజయ్ లక్ష్మణ్ షిండే పరారీలో ఉన్నాడు. వారి నుంచి సరుకుతోపాటు లారీ, మారుతి కారు, రూ.41 వేల నగదు, ఏడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొన్నారు. ముఠాను పట్టుకొన్న పోలీసులను సీపీ మహేశ్‌భగవత్ అభినందించారు.