మహబూబ్ నగర్ : రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ( BRS ) అభ్యర్థి గెలుపు కోసం సమష్టిగా పనిచేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud ) పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ మహబూబ్ నగర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పట్టణ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ( Muncipal Elections ) పార్టీ కోసం పనిచేసిన వారికీ ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.
పోటీకి అవకాశం రానివారికి భవిష్యత్ లో మంచి అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే మహబూబ్నగర్ కార్పొరేషన్ ఏర్పాటయ్యిందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లేని లోటు ప్రజలకు స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. గ్రామాల్లో పర్యటనకు వెళ్తే ప్రజలు సమస్యలు ఏకరువు పెడుతున్నారు.
మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమాను వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గం లో విద్య, వైద్యం, ఉపాధి రంగలకు ప్రాధాన్యత ఇచ్చామని, మెడికల్ కాలేజీ తో పాటు వేయి పడకల అస్పత్రి తీసుకువచ్చామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణంలో ఉన్న పనులు చాలా వరకు ఆగిపోయాయని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని పూర్తి చేయలేదని విమర్శించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులకు హితబోధ చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే నిలిచిన అభివృద్ధి పనులు పూర్తి చేయడంతో పాటు హైదరాబాద్ తో సమంతరంగా మహబూబ్ నగర్ అభివృద్ధి చేస్తామన్నారు. పాలమూరు ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. ఆంధ్ర ప్రాంతానికి మేలు చేసేవిధంగా కాంగ్రెస్ పాలన సాగుతుందని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్, గ్రంధాలయం సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్, సీనియర్ నాయకులు గణేష్, శ్రీనివాస్ రెడ్డి, అనంత రెడ్డి, అన్వార్ పాష, రెహమాన్, ఆంజనేయులు, ప్రవీణ్, నరేందర్, రాము, నవకాంత్,కిషోర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.