ఒట్టావా : భారతీయ విమానాలపై ఆంక్షలను కెనడా మరోసారి పొడిగించింది. సెప్టెంబర్ 21 తేదీ వరకు భారత్ విమానాలపై నిషేధాన్ని పొడగించినట్లు కెనడా ప్రభుత్వం తెలిపింది. కరోనా వైరస్ క్రమంలో విమాన ప్రయాణాలపై ఆంక్షలు అమలు అవుతున్నాయి. డెల్టా వేరియంట్ విజృంభన నేపథ్యంలో ఏప్రిల్ 22న ఇండియా నుంచి నేరుగా వెళ్లే విమానాలపై కెనడా బ్యాన్ విధించింది. వాణిజ్య, ప్రైవేట్ ప్యాసింజర్ విమానాలపై నిషేధం విధిస్తుండగా.. కార్గో, మెడికల్ వస్తువుల రవాణా, మిలటరీ విమానాలకు మినహాయింపును ఇచ్చింది. కెనడా ప్రభుత్వం ఎపిడెమియోలాజికల్ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది.
పరిస్థితులు అనుకూలించిన వెంటనే ప్రత్యక్ష విమానాలను తిరిగి ప్రారంభించేందుకు భారత ప్రభుత్వం, విమానయాన సంస్థలతో కలిసి పని చేస్తుందని ఫెడరల్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, కెనడాకు నేరుగా భారత్ నుంచి కాకుండా మరోదేశం నుంచి వచ్చే ప్రయాణికులకు అనుమతి ఇచ్చింది. పూర్తిగా వ్యాక్సినేట్ అయిన వారికి అనుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అలాగే ప్రయాణానికి ముందు తప్పనిసరిగా భారత్ నుంచి కాకుండా మూడో దేశం నుంచి చెల్లుబాటయ్యే కొవిడ్-19 ప్రీ డిపార్చర్ పరీక్ష పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న ఇన్బౌండ్ విమానాలపై నిషేధం ఆగస్ట్ 21తో ముగియనున్నది.