Mutual Funds | నేడు పిల్లల విద్య కోసం చేస్తున్న ఖర్చుల భారం అంతా ఇంతా కాదు. తల్లిదండ్రులకు ఇదో పెద్ద సమస్యలా తయారైంది. అయితే సరైన ప్రణాళికతో పెట్టుబడులు పెడుతూపోతే దీన్ని అధిగమించవచ్చు. దీనికున్న అవకాశాలను పరిశీలిస్తే..
ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్లు
పిల్లల ఉన్నత విద్య వంటి దీర్ఘకాల లక్ష్యాల సాధనకు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ చక్కని మార్గం. సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ల్లో పెట్టే పెట్టుబడులు ఈక్విటీల్లోకి వెళ్తాయి. చిన్న మదుపరులకూ ఇవి ఉపయుక్తంగా ఉంటాయి. అయితే ఈ పెట్టుబడులు మార్కెట్ ఒడిదొడుకులకు లోబడి ఉంటాయన్నది గుర్తుంచుకోవాలి.
ఎడ్యుకేషనల్ స్కీములు
వివిధ మ్యూచువల్ ఫండ్స్.. పిల్లల విద్యకయ్యే ఖర్చుల కోసం రకరకాల పథకాలను అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈక్విటీ, డెట్ లేదా బంగారంపై పెట్టుబడులు పెడుతూ ఆకర్షణీయ రాబడులను పొందవచ్చు.
ఫిక్స్డ్ డిపాజిట్లు
ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్లతో పోల్చితే ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ) తక్కువ రాబడులనే అందిస్తాయి. కానీ ఇవి సురక్షితమైనవి, నిర్దేశిత రాబడులనూ అందుకోవచ్చు.
విద్యా రుణాలు
ఉన్నత విద్య కోసం తల్లిదండ్రులు విద్యా రుణాలనూ తీసుకోవచ్చు. ఇతర రుణాలతో పోల్చితే వీటికి కొన్ని వెసులుబాట్లుంటాయి. మారటోరియం పీరియడ్ ఉంటుంది. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత రుణ చెల్లింపులను ప్రారంభించుకోవచ్చు. పాత పన్ను విధానం కింద ఐటీ చట్టంలోని సెక్షన్ 80ఈతో పన్ను మినహాయింపూ లభిస్తుంది.