న్యూఢిల్లీ: ఢిల్లీలోని రోహిణి కోర్టు కాంప్లెక్స్‌లో ఇవాళ కాల్పుల ఘటన జరిగింది. నాగాలాండ్‌కు చెందిన పోలీసు కానిస్టేబుల్ సర్వీస్ వెపన్ నుంచి బుల్లెట్ ఫైర్ అయ్యింది. ఓ ఘర్షణ సమయంలో తూటా పేలినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. ఇవాళ ఉదయం 9.40 నిమిషాలకు ఇద్దరు అడ్వకేట్ల మధ్య గొడవ మొదలైంది. సంజీవ్ చౌదరీ, రిషీ చోప్రాతో పాటు రోహిత్ బేరి మధ్య ఆ ఘర్షణ తలెత్తింది. గేట్ నెంబర్ 8 వద్ద వాళ్లు గొడవకు దిగారు. గేటు వద్ద విధులు నిర్వర్తిస్తున్న నాగాలాండ్ పోలీసు ఆ కొట్లాటలో జోక్యం చేసుకున్నారు. ఆ సమయంలో సర్వీస్ వెపన్ నుంచి తూటా రిలీజైంది. కావాలని ఫైర్ చేశారా లేక ప్రమాదవశాత్తు ఫైరింగ్ జరిగిందా తెలుసుకునేందుకు పోలీసులు విచారణ చేపట్టారు.