Budget 2025 | న్యూఢిల్లీ, జనవరి 27 : ఆరోగ్య సంరక్షణ, ఔషధ రంగాలు ఈసారి బడ్జెట్‌పై భారీ అంచనాల్నే పెట్టుకున్నాయి. సగటు మనిషి సైతం ఖరీదెక్కిన వైద్య చికిత్సల నుంచి ఉపశమనాన్ని ఆశిస్తున్నాడు. ఈ క్రమంలోనే రాబోయే బడ్జెట్లో ఔషధాలపై పన్నులను తగ్గించాలని, ఆరోగ్య బీమాపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)కు సంబంధించి పడుతున్న భారాన్ని కట్టడి చేయాలన్న డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. దేశంలో ఇప్పటికీ చాలామందికి ఆరోగ్య బీమా లేదన్న విషయాన్ని ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ కూడా గుర్తుచేస్తున్నది. పన్నులకు కోత పెడితే అందరికీ సులువుగా బీమా ప్రయోజనాలు అందుతాయంటున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను ఫిబ్రవరి 1న పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టబోతున్నారు. నిర్మలా సీతారామన్‌కు ఇది ఎనిమిదో బడ్జెట్ కానుండగా, వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారుకు రెండోది. అయితే గత ఏడాది ఎన్నికల నేపథ్యంలో ఈ దఫాకు ఇదే తొలి పూర్తిస్థాయి బడ్జెట్ కానున్నది.
ప్రజారోగ్య సదుపాయాలకు బడ్జెట్లో నిధుల కేటాయింపు, ప్రైవేట్ రంగానికి ఇతర ప్రోత్సాహకాలను అందిస్తే సామాన్యులకు నాణ్యమైన ఆరోగ్య సేవలు దక్కుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆరో గ్య సంరక్షణ సేవలపై ఇన్పుట్ జీఎస్టీని తగ్గించాలంటున్నారు. ప్రీమియంలతో పోల్చితే వాటి క్లెయింల విలువ ఎక్కువని, కాబట్టి బీమా ఇండస్ట్రీకి ప్రోత్సాహకాలు లభిస్తే బాగుంటుందని చెప్తున్నారు.
ఐటీ చట్టంలోని సెక్షన్ 80డీ కింద ప్రస్తుతం వ్యక్తిగత కుటుంబ ఆరోగ్య బీమా కొనుగోలుపై 25,000 వరకు పన్ను మినహాయింపును కోరవచ్చు. ఒకవేళ ట్యాక్స్‌పేయర్ వయసు 60 ఏండ్లు దాటితే ఇది రూ.50,000గా ఉన్నది. అలాగే తల్లిదండ్రుల కోసం తీసుకునే ఆరోగ్య బీమాకూ మరో రూ.25,000 వరకు పన్ను మినహాయింపును అందుకోవచ్చు. వారి వయసు 60 ఏండ్లు దాటితే ఈ ప్రయోజనం రూ.50,000. మొత్తంగా ఆరోగ్య బీమాలకు ఏటా చేసే చెల్లింపుల్లో గరిష్ఠంగా లక్ష రూపాయలదాకా పన్ను మినహాయింపులు తీసుకోవచ్చు. అయితే ద్రవ్యోల్బణం దృష్ట్యా ఎక్కువ ప్రయోజనాలున్న సమగ్ర పాలసీలనే ఇప్పుడు తీసుకోవాల్సి వస్తున్నది. వాటి ప్రీమియంలూ ఎక్కువే. అందుకే ఈసారి బడ్జెట్లో ఈ పన్ను మినహాయింపులను ఇంకా పెంచాలన్న డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. కాగా, సెక్షన్ 80డీడీ కింద ట్యాక్స్‌పేయర్స్ తమపై ఆధారపడిన దివ్యాంగుల వైద్య చికిత్సకు చేసే చెల్లింపులకుగాను ఏటా రూ.1.25 లక్షలదాకా పన్ను మినహాయింపును అందుకోవచ్చు. వ్యక్తిగత వైద్య చికిత్స ఖర్చులకూ సెక్షన్ 80డీడీబీ కింద లక్ష రూపాయల వరకు క్లెయిం చేసుకోవచ్చు.
ఇక టర్మ్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీ, పన్నుల మినహాయింపును ప్రభుత్వం పరిశీలిస్తున్నదని ఎస్బీఐ రిసెర్చ్ చెప్తున్నది. వైద్య పరికరాలపై జీఎస్టీ రేట్లు 5, 12 శాతం మించకుండా నిర్ణయం రావచ్చని తెలుస్తున్నది. ప్రస్తుతం 18 శాతం పడుతున్నది. కాగా, ‘టర్మ్/పూర్తి జీవిత బీమా, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ లేదా ఎలాంటి పన్నులు ఉండరాదు’ అని ఎస్బీఐ తమ రిపోర్ట్‌లో పేర్కొన్నది. ఎన్పీఎస్కు వీలుగా పాత/కొత్త పన్ను విధానాల్లో జీవిత, ఆరోగ్య బీమా కోసం ప్రత్యేకంగా పన్ను మినహాయింపు రూ.25,000, 50,000 ఉండాలంటున్నది. ఇదే క్రమంలో ఏపీవై, పీఎం-ఎస్వైఎం, పీఎం-కేఎంవై, ఎన్పీఎస్-ట్రేడర్లు వంటి అన్ని ప్రభుత్వ స్పాన్సర్డ్ పెన్షన్ స్కీములను ఒకే గొడుగు కిందకు తీసుకురావచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి.
ప్రస్తుతం ఆదాయ పన్ను చెల్లింపుదారులకు పాత, కొత్త పన్ను విధానాలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఐదేండ్ల కిందట కొత్త పన్ను విధానాన్ని పరిచయం చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఏటా దాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తూ రకరకాల ప్రోత్సాహకాలు, మినహాయింపుల్ని ఇస్తున్న సంగతీ విదితమే. ఈ క్రమంలో పాత పన్ను విధానాన్ని పూర్తిగా పట్టించుకోవట్లేదన్నా అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో ఈసారి బడ్జెట్లో పాత పన్ను విధానానికి స్వస్తి పలుకనున్నారన్న అంచనాలున్నాయి. దీనివల్ల ఇకపై ఒకే పన్ను విధానం ఉండనున్నది. ఆయా సెక్షన్ల కింద వివిధ రకాల పెట్టుబడులు, పొదుపు, ఖర్చులపై ట్యాక్స్‌పేయర్స్ పాత పన్ను విధానంలో పన్ను మినహాయింపుల్ని క్లెయిం చేసుకోవచ్చు. కానీ కొత్త పన్ను విధానంలో ఇవేవీ ఉండవు. వార్షిక ఆదాయం నిర్ణీత పరిమితి దాటిందంటే ఏ మినహాయింపులకు తావు లేకుండా అందరికీ ఆయా శ్లాబుల ప్రకారం పన్నులు వర్తిస్తాయి. మరోవైపు పాత పన్ను విధానాన్ని ఒకేసారి ఎత్తేయకుండా, రెండేండ్ల తర్వాత రైద్దె పోతుందన్న నిర్ణయాన్ని ఈసారి బడ్జెట్లో ప్రకటించవచ్చన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఏదిఏమైనా పాత పన్ను విధానాన్ని తొలగిస్తే మదుపు, పొదుపులకు పెద్దగా ఎవరూ ఆసక్తి కనబర్చకపోవచ్చన్న వాదనలు వస్తుండటం గమనార్హం. ముఖ్యంగా మధ్యతరగతి ఉద్యోగులకు నష్టమేనంటున్నారు. ఇక ట్యాక్స్‌పేయర్స్ ఐటీఆర్‌లను దాఖలు చేసేటప్పుడు కొత్త పన్ను విధానమే డీఫాల్ట్‌గా సెలక్టై ఉంటుంది. దీన్ని గుర్తించి పాత పన్ను విధానాన్ని ట్యాక్స్పేయర్సే ఎంచుకోవాలి. లేదంటే ఐటీ రిటర్నులు కొత్త పన్ను విధానంలోనే ఫైలింగ్ జరిగిపోతాయి.