KTR | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో లోకల్, నాన్ లోకల్ కాదు పంచాయితీ.. సీఎం రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిందే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని యూసుఫ్‌గూడలో నిర్వహించిన బీఆర్ఎస్ రోడ్ షోలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
సరిగ్గా 30 రోజుల నుంచి ప్రతి రోజు బీఆర్ఎసోళ్లు, కాంగ్రెసోళ్లు మీ ఇంటికి వస్తున్నరు. మాకే ఓటేయండి అని దండం పెట్టి అడుగుతున్నరు. మీకు దండం పెట్టి ఒక్కటే చెబుతున్నా.. గుండె మీద చేయి వేసుకుని ఒక్కటే ఆలోచన చేయండి.. పదేండ్లు కేసీఆర్ పాలనలో పరిస్థితులు బాగుండేనా..? కాంగ్రెస్ పాలనలో బాగున్నదా..? అని ఆలోచిచండి. ఏమన్నా లాభమైందా ఆలోచించండి. పదేండ్లు కేసీఆర్ నాయకత్వంలో పేదలను కడుపులో పెట్టుకుని చూసుకున్నారు. హైదరాబాద్, తెలంగాణలో సర్వతోముఖాభివృద్ధి సాధించారు. అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిచాం అని కేటీఆర్ తెలిపారు.
హైదరాబాద్‌లో 42 ఫ్లై ఓవర్లు కట్టుకున్నాం. లింకు రోడ్లు వేసుకున్నాం. బస్తీ దవఖానాలు ఏర్పాటు చేసుకున్నాం. సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల్లా కాపాడుకున్నాం. వేల పరిశ్రమలు తెచ్చుకున్నాం.. లక్షల కొద్ది ఉద్యోగాలు సృష్టించుకున్నాం. వ్యాపారాలు విస్తరించాయి. పదేండ్లు సంతోషంగా ఉన్నాం. కేసీఆర్ ఉన్నప్పుడు భూమల ధర ఎట్ల ఉండే.. ఇప్పుడు ఎట్ల అయిందో ఆలోచిచండి.. పేదల ఆస్తులు హారతి కర్పూరంలాగా కరిపోతున్నాయి ఈ కాంగ్రెస్ పాలనలో అని కేటీఆర్ పేర్కొన్నారు.
నేను లోకల్ అని అంటున్నడు కాంగ్రెస్ అభ్యర్థి. లోకల్, నాన్ లోకల్ కాదు పంచాయితీ.. ఎన్ని అబద్ధాలు, గ్యారెంటీలు చెప్పి అధికారంలోకి వచ్చిందో మీరు గుర్తుకు తెచ్చుకోండి. తులం బంగారం వచ్చిందా…? రెండున్న ర వేలు వచ్చాయా..? 4 వేల పెన్సన్ వచ్చిందా..? అయినా కూడా మళ్లీ ఓట్లు వేద్దామా..? రెండేండ్లలో ఒక్క మంచి పని చేయలేదు.. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. ఇవాళ అభివృద్ధి చేస్తామంటే నమ్ముదామా..? కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి బుద్ది చెబుదామా..? కాంగ్రెస్ అభ్యర్థి లోకల్ అయి ఉండొచ్చు.. కానీ ప్రజలను మోసం చేసింది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాబట్టి బుద్ధి చెప్పాల్సిందే అని కేటీఆర్ అన్నారు.