జగిత్యాల, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ శాసన సభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్‌రావు శనివారం మరోసారి మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఇంటికి వెళ్లి మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు.. బీఆర్ఎస్లోకి రావాలని జీవన్‌రెడ్డిని సాదరంగా ఆహ్వానించారు. జీవన్‌రెడ్డి చేరిక సందర్భంగా ఈ నెల 20న జగిత్యాలలో భారీ బహిరంగ ఏర్పాటు చేయగా, అందుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించేందుకు కేటీఆర్, హరీశ్‌రావు వచ్చారు. ముందుగా జీవన్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా కేటీఆర్, హరీశ్‌రావులకు పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలతో సన్మానించి స్వాగతించారు.
పరస్పర ఆలింగనాల అనంతరం కొంత సేపు సమావేశమయ్యారు. కాంగ్రెస్‌లో నెలకొన్న విబేధాలు, సీఎం చూపిన వివక్ష, తాను పార్టీని వీడిన పరిస్థితులను కేటీఆర్, హరీశ్‌రావుకు జీవన్‌రెడ్డి వివరించారు. తెలంగాణ ఉద్యమ రథసారథి, తన చిరకాల మిత్రుడు అయిన కేసీఆర్‌తో కలిసి పనిచేసే అవకాశం రావడం తనకు అదృష్టాన్ని కలిగించిందని జీవన్‌రెడ్డి వివరించారు. ఆ తర్వాత ఇరువురికి జీవన్‌రెడ్డి తన కుటుంబ సభ్యులను పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.