హైదరాబాద్ : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ( Minister Ponguleti ) నివాసం, కార్యాలయాలతో పాటు సంబంధిత ప్రాంతాల్లో 2024 సెప్టెంబర్ 27, 28 తేదీల్లో ఈడీ ( ED Raids ) నిర్వహించిన సోదాలు, అనంతరం కొనసాగిన దర్యాప్తు వివరాలను వెల్లడించాలని బీఆర్ఎస్ నాయకులు ( BRS Leaders ) డిమాండ్ చేశారు.
ఈ మేరకు సోమవారం బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్వై ఆధ్వర్యంలో బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీలు శంబీపూర్ రాజు, నవీన్ రెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద్ గౌడ్, సంజయ్, పార్టీ సీనియర్ నాయకులు తలసాని సాయి, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో పాటు పలువురు ముఖ్య నాయకులు ఆందోళన నిర్వహించారు.
ఈడీ కార్యాలయంలోకి వెళ్లి అధికారులకు వినతిపత్రం అందించేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు తొలుత అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఈడీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేయగా, అనంతరం అధికారులను కలిసి లేఖ అందించేందుకు పోలీసులు అనుమతించారు.
ఈడీ డిప్యూటీ డైరెక్టర్ స్వాతి ని కలిసి లేఖను అందించారు. మంత్రి ఇంటిలో, కార్యాయలంలో ఈడీ సోదాలకు రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో, ఇప్పటివరకు దర్యాప్తు ఏ దశలో ఉందో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సోదాల్లో స్వాధీనం చేసుకున్న నగదు, పత్రాలు, డిజిటల్ పరికరాలు, బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలను వెల్లడించాలని కోరారు.
ఈడీ సోదాలు సుమారు 16 ప్రాంతాల్లో ఏకకాలంలో జరిగాయని, పెద్ద సంఖ్యలో అధికారులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారని లేఖలో పేర్కొన్నారు. సోదాల సందర్భంగా నగదు లెక్కింపు యంత్రాలను కూడా తీసుకెళ్లినట్లు నాయకులు వెల్లడించారు. సోదాల అనంతరం స్వాధీనం చేసుకున్న వస్తువులు, తదుపరి దర్యాప్తు చర్యలపై స్పష్టమైన సమాచారం వెల్లడించలేదని ప్రశ్నించారు.
నరసాపూర్ కోదండల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, వాటింగపల్లి ఎఫ్ఐఆర్, కొత్వాల్‌గూడ–మనసా హిల్స్‌కు సంబంధించిన అంశాలను లేఖలో ప్రస్తావించారు. దర్యాప్తు ప్రస్తుత స్థితి . తదుపరి చర్యలు ఏమిటి? ఈ వివరాలను 15 రోజుల్లోగా వెల్లడించాలని బీఆర్ఎస్ నాయకులు ఈడీని కోరారు. చట్టం అందరికీ సమానంగా వర్తించాలన్నదే తమ అభిప్రాయమని, ప్రజలకు సంబంధించిన కేసుల దర్యాప్తు పురోగతిపై సంబంధిత సంస్థలు పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.