హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డి వీధిరౌడీల భాష మాట్లాడుతూ, సైకోలాగా వ్యవహరించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ధ్వజమెత్తారు. 2004 నుంచి 2014వరకు కాంగ్రెస్ పాలనలోనే సిరిసిల్ల ఉరిసిల్లగా మారిందని, కానీ ముఖ్యమంత్రి మాత్రం కేసీఆర్ పాలనపై నెపం నెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడేందుకు సిగ్గుండాలని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ.. సిరిసిల్లలో రేవంత్ ప్రసంగంపై ఘాటుగా స్పందించారు. అడ్డగోలు వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్ పాలనలోనే వెయ్యి మంది నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని స్పష్టంచేశారు.
కానీ నేత కార్మికులకు అండగా నిలిచి ఆదుకున్నది కేసీఆర్, కేటీఆరేనని తేల్చిచెప్పారు. ఈ విషయం ఆ ప్రాంతంవారికి స్పష్టంగా తెలుసని, రేవంత్‌రెడ్డి తప్పుడు ఆరోపణలను నమ్మబోరని స్పష్టంచేశారు. రేవంత్‌రెడ్డి సీఎం అయిన తర్వాత మళ్లీ ఆత్మహత్యలు మొదలయ్యాయని, 54మంది కార్మికులు ఉరితాడుకు వేలాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు రేవంత్‌రెడ్డి దుర్మార్గపు, సమర్థత పాలనే కారణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. నాడు టీడీపీలో ఉండి కాంగ్రెస్ నాయకులను తిట్టిన రేవంత్.. ఇప్పుడు అదే పార్టీలో చేరి గొప్పలు చెప్పుకోవడం సిగ్గనిపించడం లేదా? అని ప్రశ్నించారు.
రెమోలా రేవంత్ వ్యవహారం
రేవంత్‌రెడ్డి సడెన్‌గా రెమోలాగా మారుతున్నారని శ్రవణ్ విమర్శించారు. నేత కార్మికులపై అంత ప్రేమ ఉంటే బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్లను వారికి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఫ్యూడల్ మనస్తత్వంతో గురుకులాల యూనిఫామ్‌లు గుజరాత్ కంపెనీకి అమ్ముకున్నారని ఆరోపించారు. ఈ సొల్లు పురాణం విని సిరిసిల్ల ప్రజలు బ్రహ్మరథం పట్టాలా? అని రేవంత్‌రెడ్డిని నిలదీశారు. పద్మశాలీలకు ఎమ్మెల్సీ ఇస్తామన్న రేవంత్‌రెడ్డి.. చేనేత కార్మికులపై ప్రేమ ఉంటే కైలాష్ నేతకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘అసలు పెద్దపుట్ట గాంధీ భవన్, అసలు పెద్దపాము రేవంత్‌రెడ్డి.. ఆ పుట్టలో సొచ్చిన తెలుగుదేశం పాము’ అని దెప్పిపొడిచారు. కాంగ్రెస్ పల్లకి మోసిన వాళ్లను కాటేసిన విషనాగు అంటూ నిప్పులు చెరిగారు. ఇంత చిల్లర ముఖ్యమంత్రిని చూడలేదని మేధావులు అంటున్నారని.. రేవంత్‌రెడ్డి.. ఏం చేసినా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాదని స్పష్టంచేశారు.
కొడంగల్ నుంచి మలాజిగిరికి ఎందుకు వచ్చారు?
కేసీఆర్ కరీంనగర్ పోయినా మహబూబ్‌నగర్‌కు పోయినా ఎకడ పోటీ చేసినా తెలంగాణ ఉద్యమం కోసం వెళ్లారని శ్రవణ్ చెప్పారు. మరి రేవంత్‌రెడ్డి ఎందుకు 2018లో కొడంగల్‌లో, 2023లో కామారెడ్డిలో ఓడిపోయారు? ఆయన ఏ మత్తులో ఉన్నారు? అని ప్రశ్నించారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయితే భద్రాచలంను అయోధ్య కంటే ఎకువగా అభివృద్ధి చేసేవారని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి హాఫ్ నాలెడ్జ్ పర్సన్ అని రాముడు, శివుడి భక్తుల మధ్య గొడవ పెడుతున్నారని ఆరోపించారు.
సీఎంవో, క్యాబినెట్లో బీసీలెందరు?
హోటల్లో చిప్పలు కడిగితే తప్పా? మన టాయిలెట్స్ మనం కడుకుంటే తప్పా? సీఎం రేవంత్ సోదరుడేమైనా అమెరికాలో పటేల్ గిరీ చేస్తున్నారా? అని శ్రవణ్ దెప్పిపొడిచారు. రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌లో ఉన్న ఇల్లు కష్టార్జితంతో కొన్నారా? అని ప్రశ్నించారు. ‘నీకు ఎందుకు జూబ్లీహిల్స్ ప్యాలెస్? అంత ప్రేమ ఉంటే దళితులకు ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. సీఎం, ఆయన అన్నదమ్ములు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పందికొకుల్లా దోచుకుతింటున్నారని ఆరోపించారు.
కేసీఆర్ ప్రభుత్వంలో తొలి అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి బీసీ, మండలి చైర్మన్ స్వామిగౌడ్ బీసీ అని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి సీఎంవో, క్యాబినెట్లో ఎంతమంది బీసీలు ఉన్నారని అని నిలదీశారు. రాముడికి, శివుడికి పంచాయితీ పెడుతున్న రేవంత్‌రెడ్డి తోలు తీయాలంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ ఇంటి వద్ద చావు డప్పు కొట్టేందుకు వెళ్లిన కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, నర్సారెడ్డి దళితులుగా కన్వర్ట్ అయ్యారా? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి బిట్ కాయిన్ల రూపంలో పెట్టుబడులు పెడుతున్నారని, అందుకే ఢిల్లీ, ముంబై వెళ్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి గోడలకు సున్నాలు వేసి, చంద్రబాబు బూట్లు నాకి వేల కోట్లు సంపాదించారా? పెయింటర్ రెడ్డి ప్యాలెస్ రెడ్డిగా ఎలా మారారో చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ చిరుమళ్ల రాకేశ్‌కుమార్ పాల్గొన్నారు.