సిటీబ్యూరో, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీలో పునర్విభజన ప్రక్రియపై అభ్యంతరాలు పోటెత్తుతున్నాయి. అధికార పార్టీ నేతల నుంచి విపక్షాలు, కాలనీ సంఘాలు, స్థానికులు ఇలా అన్ని వర్గాలు తీవ్రంగా సర్కారును తీరును ఎండగడుతున్నాయి. వార్డులోని ఓటర్ల సంఖ్య, భౌగోళిక స్వరూపం, సరిహద్దులను సమన్వయం చేసుకుని చేపట్టాల్సిన వార్డుల విభజనలో శాస్త్రీయత ఏ మాత్రం పాటించలేదంటూ భగ్గుమంటున్నాయి.
300 వార్డులను విభజించిన అధికారులు గందరగోళ పరిస్థితుల్లోకి తీసుకువచ్చారని, ఇంత హడావుడిగా విలీనం, వికేంద్రీకరణ ప్రక్రియను చేపట్టాల్సిన అవసరం ఏం వచ్చిందంటూ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే డీలిమిటేషన్ పై అభ్యంతరాలు, సలహాల స్వీకరణ వారం వ్యవధి గడువు తుది దశకు చేరింది. బీఆర్ఎస్, ఎంఐఎం ఎమ్మెల్యేలు, బీజేపీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున పునర్విభజన జరుగుతున్న తీరుపై విమర్శించారు. రెండు రోజుల్లో అభ్యంతరాల గడువు ముగియనున్నది. ఇప్పటి వరకు 1328 మంది అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ప్రధానంగా అభ్యంతరాలను 25 వేల ఓటర్లకు మించకుండా వార్డులను ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఉన్న వార్డుల పేర్లను మార్చాలని అభ్యంతరాలను వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
జీహెచ్ఎంసీలోకి 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం, వార్డుల డీలిమిటేషన్ పై ఈ నెల 16న జరగనున్న కౌన్సిల్లో బలంగా గళం విన్పించేందుకు బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు సిద్ధమయ్యారు.. వార్డుల పునర్విభజనపై జీహెచ్ఎంసీ అభ్యంతరాలు, సలహాలు స్వీకరిస్తుండగా, ఇప్పటికే పలువురు మేయర్‌ను కలిసి పునర్విభజన అశాస్త్రీయంగా, ఒక వర్గానికి రాజకీయ ప్రయోజనాన్ని చేకూర్చేలా జరుగుతున్నదని ఆరోపించారు. ఈ క్రమంలోనే కౌన్సిల్ సమావేశంలో కూడా పునర్విభజనపై నిరసనలు చేపట్టేందుకు సిద్ధమైన వేళ మంగళవారం జరిగే కౌన్సిల్ సమావేశం సర్వత్రా ఆసక్తి నెలకొంది.
జీహెచ్ఎంసీలోకి 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం తర్వాత 300 వార్డులుగా విభజించిన అధికారులు అభ్యంతరాలు, సలహాలను ఇవ్వాలంటూ ఈ నెల 9న కమిషనర్ ఆర్ వీ కర్ణన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. వారం రోజుల గడువుతో ఈ నెల16వ తేదీ తుది గడువు ఇచ్చారు. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ సంబంధించిన ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్, సర్కిల్ కార్యాలయంలో అభ్యంతరాల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియ రేపటితో ముగియనున్నది. అయితే హడావుడిగా చేసిన వార్డుల విభజనపై అన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించకుండా ఆఫీస్‌లలో కూర్చోని గూగుల్ మ్యాప్‌ల ఆధారంగా డివిజన్లను ఏర్పాటు చేశారు. రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు, కాలనీలు, బస్తీ ప్రజలు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా డివిజన్ల విభజన చేశారు. అభ్యంతరాలు తెలియజేయడానికి స్వల్ప సమయం ఇవ్వడం సరికాదు. ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలకు అనుగుణంగా మార్పులు చేయాలి. లేని పక్షంలో న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం.
– తలసాని శ్రీనివాస్ యాదవ్, సనత్‌నగర్ ఎమ్మెల్యే
డివిజన్ల విభజన ప్రక్రియ సక్రమ పద్ధతిలో జరగలేదు. విభజనకు అవసరమైన సరికొత్త డివిజన్ మ్యాపులను జీహెచ్ఎంసీ అందించలేదు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బల్దియాలో విలీనమైన మూడు మున్సిపాలిటీలకు సంబంధించి వార్డుల ఏర్పాటు సక్రమంగా జరగలేదు. నియోజకర్గంలో పెరిగిన వార్డుల విభజన ఇష్టానుసారంగా ఏర్పాటు చేశారు.
– మల్లారెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే