మరికల్ : నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలోని బస్టాండ్‌లో ( Bus stand ) అడుగుకొక గుంతతో రోజుకో ప్రమాదం జరుగుతున్న సంబంధిత అధికారులు , ఎమ్మెల్యే చిట్టెం పరిణికా రెడ్డి పట్టించుకోవడంలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు వినూత్న తరహాలో నిరసన చేపట్టారు. బస్టాండ్‌లోని గుంతల్లో వరినాట్లు వేసి నిరసన తెలిపారు.
కేసీఆర్( KCR ) ప్రభుత్వ హాయంలో నారాయణపేట మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డి బస్టాండ్ అభివృద్ధికి కోటి 75 లక్షలు మంజూరు చేయగా ఇప్పటి వరకు పనులు చేపట్టలేదని ఆరోపించారు. ఎన్నికలు జరిగి ప్రభుత్వ మారడంతో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు వినియోగించుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లంబాడీ తిరుపతయ్య విమర్శించారు.
అధికారులు, నారాయణపేట ఎమ్మెల్యే తక్షణమే స్పందించి మరికల్ బస్ స్టాండ్‌లో సీసీ రోడ్లు వేసి బస్టాండ్‌ను ఆధునికరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మరికల్ మండల వైస్ ఎంపీపీ రవి కుమార్ యాదవ్, మండల కో ఆప్షన్ మాజీ సభ్యులు మథిన్, మాజీ ఎంపీటీసీ సుజాత శ్రీనివాసులు, నాయకులు కృష్ణారెడ్డి, వీర బసంత్, కృష్ణయ్య, రవి గౌడ్, జగదీష్, హుస్సేన్, బాలకృష్ణ, మాసన్న, కమల్, అశోక్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.