హైదరాబాద్, ఫిబ్రవరి19(నమస్తేతెలంగాణ): తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గూండారాజ్యం నడుపుతున్నదని బీఆర్ఎస్ శాసనమండలి పక్షం ధ్వజమెత్తింది. మున్సిపల్ ఎన్నికల వేళ యథేచ్ఛగా హక్కులను కాలరాసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని మండిపడింది. క్యాతనపల్లిలో ప్రజాతీర్పును అపహాస్యం చేస్తూ బీఆర్ఎస్పై దౌర్జన్యకాండకు దిగడం దుర్మార్గమని పేర్కొన్నది. ప్రజాతీర్పును గౌరవించాలని పోరాడుతున్న చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్ అమానుషమని తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.
ఆయనపై కేసులు ఎత్తివేసి భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది. గురువారం శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అసెంబ్లీ హాలులోని తన కార్యాలయంలో అందుబాటులో ఉన్న పార్టీ ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ సర్కార్ అవలంబించిన అప్రజాస్వామిక విధానాలు, బాల్క సుమన్ అరెస్ట్, బడ్జెట్ అంశంపై త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో లెవనెత్తాల్సిన అంశాలపై చర్చించారు. అంతకు ముందు ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆ మహనీయుడి ధైర్య సాహసాలను కొనియాడారు. ఆయన జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
నిత్యం రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ క్యాతనపల్లి ఘటనలపై ఎందుకు స్పందిచడం లేదని బీఆర్ఎస్ శాసనమండలి పక్షం నిలదీసింది.‘తెలంగాణలో కాంగ్రెస్ నేతలు సాగించిన దుర్మార్గాలు ఆయనకు కనబడటంలేదా? లేదంటే చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారా? కావాలనే వెనుకేసుకొస్తున్నారా? దేశంలో ఒక విధానం.. రాష్ట్రంలో మరో విధానామా?’ అంటూ సూటిగా ప్రశ్నాస్త్రాలను సంధించింది. నిజంగా ఆయనకు ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై నమ్మకముంటే తెలంగాణ ప్రభుత్వ పెద్దలపై కఠిన చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేసింది. క్యాతనపల్లిలో కాంగ్రెస్ నాయకులు పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని చెరబట్టారని విమర్శించింది. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు కాంగ్రెస్ నేతలకు వంతపాడారని ఆరోపించింది. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అద్భుత ఫలితాలు సాధించడం చూసి బెంబేలెత్తిపోయిన కాంగ్రెస్ పార్టీ.. మున్సిపల్ ఎన్నికల్లో అరాచకపర్వాన్ని కొనసాగించిందని నిప్పులు చెరిగింది. బీఆర్ఎస్ను నిలువరించేందుకు వ్యవస్థలను దుర్వినియోగం చేసిందని విమర్శించింది.
‘మంత్రి వివేక్ కండ్లల్లో ఆనందం కోసం యత్నించడాన్ని అధికారులు మానుకోవాలని, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై మోపిన అక్రమ కేసులను ఎత్తివేసి భేషరతుగా విడుదల చేయాలి’ అని బీఆర్ఎస్ శాసనమండలి పక్షం డిమాండ్ చేసింది. క్యాతనపల్లిలో అడ్డదారిలో గెలిచేందుకు యత్నించిన తీరును తెలంగాణ సమాజం గమనిస్తున్నదని పేర్కొన్నది. రాష్ట్రంలో ప్రజాతీర్పును అవహేళన చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించింది. సమావేశంలో శాసనమండలి సభ్యులు ఎల్ రమణ, దేశపతి శ్రీనివాస్, తాతా మధు, వాణీదేవి, కోటిరెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి, గోరటి వెంకన్న, దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు.