భీమ్గల్, జూన్ 15: యూరియా యాప్ పేరిట ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నదని బీఆర్ఎస్ నాయకులు ఆ గ్రహం వ్యక్తంచేశారు. యాప్ను తక్షణమే రద్దు చేసి, యూరియాను విరివిగా రైతులకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశానుసారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం రాస్తారోకో చేపట్టారు. రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల కన్వీనర్ దొనకంటి నర్సయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించాల్సిందిపోయి కొత్త కొత్త నిబంధనలతో వారిని మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. యూరియా పంపిణీ కోసం ప్రవేశపెట్టిన యాప్ రైతులకు ఉపయోగకరం కాకుండా భారంగా మారిందని పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్, సర్వర్ సమస్యలు, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహనలేమి, యాప్ పనిచేయకపోవడం వంటి కారణాలతో రైతులు గంటల తరబడి ఎరువుల కేంద్రాల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కావాల్సినంత యూరియా ఇవ్వకుండా సగానికి కుదించి ఇవ్వడంతో పంట దిగుబడి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. వ్యవసాయ పనులు అత్యంత కీలక దశలో ఉన్న సమయంలో యూరియా కోసం రైతులు కార్యాలయాలు, ఎరువుల దుకాణాల చుట్టూ తిరగాల్సిరావడం దురదృష్టకరమన్నారు. కేసీఆర్ హయాంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు పొందేవారని గుర్తుచేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం యాప్ పేరుతో అనవసరమైన నిబంధనలు విధించి రైతులను మానసికంగా, ఆర్థికంగా వేధిస్తున్నదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, నాణ్యమైన విత్తనాలు, సకాలంలో ఎరువులు అందడంతో వ్యవసాయరంగం బలోపేతమైనట్లు తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.
యూరియా యాప్ను వెంటనే రద్దు చేసి, ఎరువుల పంపిణీని పాత విధానంలో కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ‘యాప్లో లేదు యూరియా.. షాప్లో ఉంది యూరియా’ అం టూ నినాదాలు చేశారు. స్థానిక ఎస్సై సీహెచ్. తిరుపతి, మండల వ్యవసాయాధికారిణి లావణ్య, తహసీల్దార్ కిరణ్కుమార్ అక్కడికి చేరుకొని బీఆర్ఎస్ నాయకులకు సర్దిచెప్పారు. వారు ససేమిరా అనడంతో చివరికి బలవంతంగా ఆందోళనను విరమింపజేశారు. మాజీ ఎంపీపీ, జడ్పీటీసీలు ఆర్మూర్ మహేశ్, చౌట్పల్లి రవి, కౌన్సిలర్లు బొదిరె నర్సయ్య, మల్లెల ప్రసాద్, మూత లింబాద్రి, రాజూనాయక్, రాములు, సాగర్ తోట లింగం, రతన్, గంగాధర్ గౌడ్, తోట శంకర్, సతీశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.