హైదరాబాద్, అక్టోబర్ 3(నమస్తే తెలంగాణ) : ఉస్మానియా విశ్వవిద్యాలయం అభివృద్ధికి రూ.1,000 కోట్లు, చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీకి రూ.500 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 2025 డిసెంబర్లో ఆర్భాటంగా ప్రకటించారని, అయితే ఇప్పటివరకు పైసా విడుదల చేయకుండా విద్యార్థులను మోసం చేశారని కార్పొరేషన్ మాజీ చైర్మన్ చిరుమళ్ల రాకేశ్‌కుమార్ ఆరోపించారు. శనివారం తెలంగాణ భవన్లో విద్యార్థి నేతలు గౌతంప్రసాద్, రవినాయక్, పడాల సతీశ్‌కుమార్, కోట్ల మహిపాల్ ముదిరాజ్‌లతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం యూనివర్సిటీలకు ఇచ్చిన హామీలను తుంగలో తొకి విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నదని మండిపడ్డారు. విద్యార్థుల హాస్టల్ వసతి కోసం అవసరమైన రూ. 200 కోట్లు కూడా ఇవ్వలేదని, యూనివర్సిటీల పేర్లు మార్చడం తప్ప ప్రభుత్వం చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. బీసీ ఫీజురీయింబర్స్ మెంట్, మెస్‌చార్జీల బకాయిలు కూడా చెల్లించలేదని ఆరోపించారు. ఓయూకు ఇస్తామన్న రూ.1,000కోట్లు, ఐలమ్మ యూనివర్సిటీకి ఇస్తామన్న రూ.500కోట్లు ఏమయ్యాయో స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు.
విశ్వవిద్యాలయాల ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీల నుంచి జీతాలు ఇవ్వాల్సిన దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ఆయా యూనివర్సిటీలకు ఇస్తామన్న నిధులు ఇవ్వాలని, ఓయూ అభివృద్ధికి ఇప్పటివరకు ఎన్ని కోట్లు ఖర్చు చేశారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామని రాకేశ్‌కుమార్ హెచ్చరించారు.
సీఎం రేవంత్‌రెడ్డి అస్తవ్యస్త విధానాలతో విద్యారంగాన్ని సర్వనాశనం చేస్తున్నారని బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు పడాల సతీశ్‌కుమార్ ధ్వజమెత్తారు. యూనివర్సిటీల్లో బోధనా సిబ్బంది ఖాళీలను భర్తీచేయకపోవడంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు.
మోసపూరిత విధానాలతో విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న కాంగ్రెస్‌కు, వచ్చే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన బుద్ధిచెప్పాలని పట్టభద్రులకు పిలుపునిచ్చారు. విద్యా నిలయమైన ఉస్మానియా యూనివర్సిటీని కాంగ్రెస్ సర్కార్ గంజాయి మొక్కలకు నిలయంగా మార్చిందని రాజేశ్‌నాయక్ ఆరోపించారు. విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కర్రుకాల్చి వాతపెట్టాలని గౌతం ప్రసాద్ గ్రాడ్యుయేట్లను కోరారు.