హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 22ఏ భూసమస్యల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. నాలా అనుమతి లేకుండా నివాస వినియోగంలోకి వచ్చిన పట్టా భూములనూ రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించింది. నాలా రుసుము చెల్లిస్తే అర్హత ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. అర్హత ఉన్న అన్ని దరఖాస్తులను కాలపరిమితితో పరిష్కరించాలని ఆదేశించింది.
ఆయా దరఖాస్తులను రెవెన్యూ రికార్డులు, భూమి హక్కులు, క్షేత్రస్థాయి పరిస్థితులను సమగ్రంగా పరిశీలించి నిబంధనల ప్రకారం నాలా రుసుము, ఇతర ప్రభుత్వ రుసుములను వసూలు చేసి, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నది. అర్హత ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించి, అమలు పురోగతిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని కలెక్టర్లను ఆదేశించింది.