జడ్చర్లటౌన్, అక్టోబర్ 3 : తెలంగాణలో సీఎం రేవంత్రెడ్డి సహకారంతో రియల్ ఎస్టేట్ దందా జోరుగా సాగుతున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ ఆరోపించారు. దళిత క్రైస్తవుల భూములను కొందరు రియల్ వ్యాపారస్తులు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని ఎంబీ సెంటర్లో భవనాల కూల్చివేత, భూ వివాదం ఘటనల నేపథ్యంలో శనివారం మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజీవ్సాగర్తో కలిసి ఆయన సందర్శించారు.
ఎంబీ సెంటర్ సొసైటీ సభ్యురాలు డాక్టర్ అనురాధకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంబీ మెడికల్ సంస్థ సేవలు జడ్చర్లతోపాటు ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాల్లోనూ అందుతున్నాయని తెలిపారు. ఎంబీ మెడికల్ సెంటర్ భూమిలో చర్చి, క్రైస్తవుల సమాధులు ఉన్నాయని, ఈ సెంటర్ దళిత క్రైస్తవుల మనోభావాలకు సంబంధించిన అంశంగా పేర్కొన్నారు. నేటికీ భూభారతిలో ఈ సంస్థకు సంబంధించిన భూమిగా చూయిస్తున్నా.. పోలీసులు మాత్రం ప్రైవేట్ వ్యక్తులకు మద్దతు తెలుపడం దుర్మార్గమని మండిపడ్డారు. రూ.300 కోట్ల విలువైన భూమిని ఆక్రమించి వందలాది మంది రౌడీలతో పహారా కాస్తున్నారని ఆరోపించారు.
సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకే పోలీసులు ఆక్రమణదారులకు మద్దతు ఇస్తున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఎంబీ మెడికల్ సెంటర్ దవాఖాన జిల్లా ప్రజలకు విశిష్ట సేవలు అందించిందని.. తాను కూడా ఇదే దవాఖానాలో జన్మించానని పేర్కొన్నారు. వందేండ్లుగా ఈ స్థలం ఎంబీ మెడికల్ సొసైటీ ఆధ్వర్యంలోనే ఉన్నదని స్పష్టంచేశారు. అనంతరం ఎంబీ సెంటర్ను పరిశీలించేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఎంబీ సొసైటీ సభ్యులు, క్రైస్తవులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొన్నది. దీంతో సొసైటీ సభ్యురాలు అనురాధను పోలీసులు సెంటర్లోకి పంపించారు.