Jeevan Reddy | రేవంత్‌రెడ్డి తెలంగాణకు శనిలా దాపురించాడు.. జీవన్ రెడ్డి ఫైర్
Jeevan Reddy | మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతుల కోసం ఒత్తిడి పెరుగుతుండటంతోనే సీఎం రేవంత్‌రెడ్డి తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై నిద్రలేచినట్లు నటిస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టి. జీవన్‌రెడ్డి విమర్శించారు.
Jeevan Reddy | మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతుల కోసం ఒత్తిడి పెరుగుతుండటంతోనే సీఎం రేవంత్‌రెడ్డి తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై నిద్రలేచినట్లు నటిస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టి. జీవన్‌రెడ్డి విమర్శించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం మూడు నెలల సమయం వృథా చేశారని, డీపీఆర్ లేకుండానే చర్చలకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ఇదంతా కాలయాపన కోసమేనని ఆరోపించారు. తెలంగాణ భవన్లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేత డాక్టర్ కురువ విజయ్‌కుమార్‌తో కలిసి జీవన్‌రెడ్డి మాట్లాడారు.
తుమ్మిడిహట్టి ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఆశ్చర్యం కలిగిస్తోందని జీవన్‌రెడ్డి అన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశం కోసం మూడు నెలలు ఎదురుచూశారని, తీరా డీపీఆర్ లేకుండానే చర్చలకు వెళ్లారని విమర్శించారు. ముంపునకు సంబంధించిన పరిహారాన్ని మహారాష్ట్ర జాయింట్ అకౌంట్లో జమ చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లడం లేదని, కాలయాపనకే ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు.
రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే తుమ్మిడిహట్టి పనులు ప్రారంభించి ఉంటే ఈపాటికి ప్రాజెక్టు పూర్తయ్యేదని అన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్టు విషయంలో అనుసరించిన వ్యూహాన్నే తెలంగాణ ప్రభుత్వం తుమ్మిడిహట్టి విషయంలో అనుసరించాలని సూచించారు. 152 మీటర్ల వద్ద శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాలని, ఆ తర్వాత ఎంత ఒప్పందం కుదిరితే దానికి కట్టుబడి ముందుకు సాగాలని పేర్కొన్నారు.
కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద 20 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉన్నప్పటికీ ప్రభుత్వం నీటిని ఎత్తిపోయడంపై దృష్టి పెట్టడం లేదని జీవన్‌రెడ్డి విమర్శించారు. తక్షణమే కన్నెపల్లి పంప్‌హౌస్‌ను వినియోగించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాఫర్ డ్యామ్ నిర్మాణం చేపట్టాలని మొత్తుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తాత్కాలిక వ్యూహంలో భాగంగా ఈ పనులు చేపడితే శాశ్వత ప్రాతిపదికన చేపట్టే మరమ్మతులకు ఎలాంటి అడ్డంకి ఉండదని స్పష్టం చేశారు.
కన్నెపల్లి నుంచి ఒక్క టీఎంసీ నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. మొత్తం 150 టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి వీలున్నా మొద్దు నిద్రపోతోందని విమర్శించారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు గోదావరి నదిపై ఉండగా, మేడిగడ్డ ప్రాణహిత నదిపై ఉందని వివరించారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు సురక్షితంగానే ఉన్నాయని, కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసినా వాటికి ఎలాంటి నష్టం ఉండదని పేర్కొన్నారు.
సీడబ్ల్యూపీఆర్ఎస్ (CPWR S) నివేదికను ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు. కాఫర్ డ్యామ్ నిర్మాణం చేపట్టి నీటిని వినియోగించుకోవాలని సూచించినా పట్టించుకోవడం లేదన్నారు. తాత్కాలికంగా నీటిని ఎత్తిపోసుకునే చర్యలు చేపడితే రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు.
కేసీఆర్ మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని జీవన్‌రెడ్డి గుర్తుచేశారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి మూడేళ్లలో మేడిగడ్డలోని రెండు పిల్లర్లకు మరమ్మతులు కూడా చేయించలేకపోయారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి ఏం చేస్తున్నారో ఆయనకే అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో నీటి సమస్యలపై దృష్టి పెట్టకుండా ఆర్ఆర్ ట్యాక్స్‌పై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని ఆరోపించారు. ‘రేవంత్‌రెడ్డి తెలంగాణకు శనిలా దాపురించాడు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇసుక బస్తాలు అడ్డుపెట్టి నీటిని నిలిపే ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటి ముందస్తు చర్యలపై ఉన్న శ్రద్ధ కన్నెపల్లి పంప్‌హౌస్ విషయంలో ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో విడుదల చేస్తారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు తెలియదా? అని నిలదీశారు.
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంపై ప్రభుత్వం ముందస్తు దృష్టి పెట్టలేదని, కరువును ఎదుర్కొనే కార్యాచరణ కూడా రూపొందించలేదని జీవన్‌రెడ్డి విమర్శించారు. కరువు సహాయక చర్యలు శూన్యమని, ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితమైందని అన్నారు. సీఎం, మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారని, రైతులను అయోమయానికి గురిచేస్తున్నారని పేర్కొన్నారు.
రైతు కూలీలకు ఆత్మీయ భరోసా సాయం ఏమైందని ప్రశ్నించారు. జాబ్ కార్డులు ఉన్న కూలీలకు ఒక్కొక్కరికి రూ.12 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. కరువు పరిస్థితుల్లో రైతులతోపాటు రైతు కూలీలు, ఇతర వర్గాలకు కూడా భరోసా కల్పించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు.
యాసంగి పంట సాగుపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని జీవన్‌రెడ్డి కోరారు. రైతు భరోసా పథకంపై ప్రభుత్వం ఏం చేయదలుచుకుందో వెల్లడించడం లేదని విమర్శించారు. రైతు రేవంత్‌రెడ్డి కంటే ఎక్కువ ఆలోచనాపరుడని వ్యాఖ్యానించారు. కరువు పరిస్థితుల్లో రైతులకు సాగునీటి భరోసా కల్పించడంతోపాటు వినియోగదారుల సమస్యలను కూడా ప్రభుత్వం పట్టించుకోవాలని సూచించారు. నిత్యావసర సరుకుల ధరలు అదుపులో లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
రాష్ట్రంలో కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ ప్రకటించాలని, కన్నెపల్లి పంప్‌హౌస్‌ను తక్షణమే వినియోగించి రైతులకు నీరందించాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. కరువు సమయంలో అన్ని వర్గాలకు అండగా నిలవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jeevan Reddy | రేవంత్‌రెడ్డి తెలంగాణకు శనిలా దాపురించాడు.. జీవన్ రెడ్డి ఫైర్
KTR | వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటదో.. భూములు అమ్మే బ్రోకర్ రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే అలానే ఉంది : కేటీఆర్
Chief Minister Vijay | ముఖ్యమంత్రి విజయ్‌కి పూలు ఇచ్చి ప్రపోజ్ చేసిన చిన్నారి.. వీడియో వైరల్!
Polio | ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని దేశాల్లో వ్యాప్తి చెందుతున్న పోలియో.. కారణాలేమిటి..?
Abdul El-Sayed: అమెరికాలో కొత్త చరిత్ర.. తొలి ముస్లిం సేనేటర్గా అబ్దుల్ ఎల్ సయ్యద్ ఎన్నిక
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

