– కార్యకర్తలే కథానాయకులు కావాలి
– అక్కడ ఘరానా దొంగ.. జిల్లాలో గజదొంగల పాలన
– సాగు రంగాన్ని కాంగ్రెస్ సంక్షోభంలోకి నెట్టింది
– ఎస్ ఐ ఆర్ ప్రక్రియపై అప్రమత్తత అవసరం
– పాలేరు బీఆర్ఎస్ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఖమ్మం రూరల్, జూన్ 17 : రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, తిరిగి కేసీఆర్ సీఎం కావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ పరిధిలోని ఏదులాపురం మున్సిపాలిటీ అందుగల హర్ష కన్వెన్షన్ హాల్లో పాలేరు నియోజకవర్గ స్థాయి పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశం జరిగింది. పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఎస్ ఐ ఆర్ ప్రక్రియ, పార్టీ సభ్యత నమోదు అంశాలపై కార్యకర్తలు, నాయకులకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో గజదొంగ పాలన కొనసాగుతుంటే.. ఖమ్మం జిల్లాలో ఘరానా దొంగల పాలన కొనసాగుతుందన్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా జిల్లా ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. దాచుకోవడం దోచుకోవడం తప్ప జిల్లా అభివృద్ధికి వారు పాటుపడిందేమి లేదని స్వార్థ ప్రయోజనాల కోసమే పాలన కొనసాగిస్తున్నారన్నారు.

‘రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే’
ఒక మంత్రి భూముల కబ్జాలకు పాల్పడుతుంటే, మరో మంత్రి వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టారన్నారు. ఇక ఆర్థిక మంత్రి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేశారని విమర్శించారు. ప్రతిరోజు కేసీఆర్ అప్పులు చేశాడని మోరుగుతున్న నాయకులు ఎందుకు చేశారో బదులిచ్చారు. కేసీఆర్ చేసిన అప్పులకు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి సజీవ సాక్షాలుగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర ఏళ్లలో లక్షల కోట్లు అప్పుచేసి ఏమి అభివృద్ధి చేసిందో రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారన్నారు. రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఆలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూ దందాలకు పాల్పడుతూ అనేక అక్రమాలకు ఊతమిస్తున్నారన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలను సభా వేదికపై ప్రదర్శించారు. మరికొద్ది రోజుల్లో ఎస్ ఐ ఆర్ ప్రక్రియ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ప్రతి బిఎల్ఎ అప్రమత్తంగా ఉండాలన్నారు. అర్హత గల వ్యక్తుల ఓటర్లు తొలగించకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో దిశా నిర్దేశం చేశారు.

‘రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే’
డిజిటల్ సభ్యత్వ నమోదులో యువత క్రియాశీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. జిల్లా పర్యటనకు వచ్చిన యువ నేత కేటీఆర్ కు అటు హెల్ప్ వద్ద ఇటు సభా ప్రాంగణం వద్ద కార్యకర్తలు నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు తక్కలపల్లి రవీందర్రావు, తాత మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు మెచ్చ నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు లింగాల కమల్ రాజ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి, దిండిగాల రాజేందర్, మరికంటి ధనలక్ష్మి, పాలేరు నియోజకవర్గ నాలుగు మండలాల పార్టీ మాజీ అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, భాషపోయిన వీరన్న, పున్నం బ్రహ్మయ్య, వేముల వీరయ్య పాల్గొన్నారు